Young Australian Cricketer: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. దూసుకొచ్చే బంతిని అత్యంత జాగ్రత్తగా బ్యాట్ తో ఆడాల్సి ఉంటుంది. బ్యాట్ పట్టుకునే విధానంలో నేర్పు ఉంటే… ఆ బంతిని ఎలాగైనా కొట్టొచ్చు. ఇలా కొట్టాలంటే నేర్పరితనం ఉండాలి. ఆ నేర్పరితనం కోసం ఆటగాళ్లు సంవత్సరాలకు సంవత్సరాలు శ్రమిస్తుంటారు. మైదానంలోనే గడుపుతూ ఉంటారు. దూసుకు వచ్చే బంతిని అత్యంత జాగ్రత్తగా ఆడుతూ.. ఆటలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు.
క్రికెట్ ఆడే క్రమంలో దూసుకు వచ్చే బంతి వల్ల చాలామంది ఆటగాళ్లు గాయపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో బంతి వల్ల ఆటగాళ్లు ఆసుపత్రుల పాలవుతుంటారు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ జరుగుతున్నప్పుడు టీమ్ ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ బంతిని డిఫెన్స్ చేయబోయాడు. అధిక స్థాయి అతడి పాదానికి తగిలింది. వాస్తవానికి అతడు అత్యంత శక్తివంతమైన బూట్లు ధరించినప్పటికీ.. బంతి తగిలిన వేగానికి బూటు ముందు భాగం ధ్వంసం అయింది. అంతేకాదు అతడి చిటికెన వేలుకు తగలడంతో తీవ్ర గాయమైంది. ఆ గాయానికి తట్టుకోలేక అతడు విలవిలలాడిపోయాడు. ఇప్పటివరకు కూడా అతడు ఇంకా కోలుకోలేదు.
రిషబ్ పంత్ మాత్రమే కాదు.. టీమిండియాలో ఎంతోమంది ఆటగాళ్లు బంతులు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. రోజులకు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందారు.. టీమిండియాలో అప్పట్లో సబా కరీం అనే వికెట్ కీపర్ బంతిని అందుకు పోతుండగా అది అతడి ముక్కుకు తగిలింది. తీవ్రంగా గాయపడి అతడు తన కెరియర్ మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాలో ఓ యువ ఆటగాడు బంతి తగిలి కన్నుమూశాడు. 17 సంవత్సరాల వయసు ఉన్న ఓ యువ ఆటగాడు బంతి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. మైదానంలోనే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ.. రెండు రోజులపాటు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందిన అతడు కన్నుమూశాడు. మెల్ బోర్న్ ప్రాంతానికి చెందిన బెన్ ఆస్టిన్ అనే 17 సంవత్సరాల ఆస్ట్రేలియా ఆటగాడు టి20 మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. శిక్షణలో భాగంగా అతడు ప్రాక్టీస్ చేస్తుండగా బంతి మెడకు తగిలింది. దీంతో అతడు అక్కడే కుప్ప కూలిపోయాడు.. సహచర ఆటగాళ్లు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడిన అతడు గురువారం కన్నుమూశాడు. తలకు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ బంతి మెడ భాగానికి బలంగా తగలడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన పిల్ హ్యూస్ అనే ఆటగాడు బంతి తగిలి ఇదే విధంగా కన్నుమూశాడు.