WPL 2024: హర్మన్ ప్రీత్ వీర విహారం.. ముంబై అనూహ్య విజయం

గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ బేత్ మూనీ(66), హేమలత (74) దూకుడుగా బ్యాటింగ్ చేయడం, ఫుల్మాలి(21) చెలరేగడంతో గుజరాత్ 190 పరుగులు చేసింది.

Written By: Velishala Suresh, Updated On : March 10, 2024 8:39 am

WPL 2024

Follow us on

WPL 2024: అద్భుతం, సంచలనం, అమోఘం, అపూర్వం.. ఇంకా ఎన్ని పదాలుంటే అన్ని పదాలు.. ఎందుకంటే ముంబై సాధించిన విజయం అలాంటిది మరి. అసలు ఆశలు లేని చోట.. హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ ఉమెన్ హిట్టింగ్ తో దుమ్మురేపింది. కుదిరితే ఫోర్.. లేకుంటే సిక్స్.. అన్నట్టుగా చెలరేగింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో శనివారం గుజరాత్ జట్టుతో రాత్రి జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ బేత్ మూనీ(66), హేమలత (74) దూకుడుగా బ్యాటింగ్ చేయడం, ఫుల్మాలి(21) చెలరేగడంతో గుజరాత్ 190 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ (2/31) రెండు వికెట్లు పడగొట్టింది. హీలి మాథ్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, పూజా వస్త్రాకర్, సంజన తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం చేజింగ్ కు దిగిన ముంబై జట్టు 19.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి సంచలన విజయాన్ని సాధించింది ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 10 ఫోర్లు, ఐదు సిక్స్ లతో 95) వీర విహారం చేసింది. హర్మన్ కు భాటియా (36 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 49 ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నది) తోడుగా నిలిచింది. గుజరాత్ జట్టు బౌలర్లలో ఆశ్లే గార్డ్ నర్, తనుజ కాన్వర్, షబ్నం తలా ఒక వికెట్ తీశారు.

ఆఖరి ఓవర్లో మ్యాజిక్

చివరి ఓవర్ లో ముంబై విజయానికి 13 పరుగులు కావలసి వచ్చింది. అష్లే గార్డ్ నర్ బౌలింగ్ వేస్తోంది. తొలి రెండు బంతుల్లో హర్మన్ కళ్ళు చెదిరే లాగా 6, 4 బాది ముంబై జట్టులో హర్షాతిరేకాలను నింపింది. ఆ తర్వాత మూడు బంతులకు సింగిల్స్ తీయడంతో ముంబై జట్టు విజయం ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్లో అమేలీయా కేర్ తో కలిసి హర్మన్ ప్రీత్ నాలుగో వికెట్ కు ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ముంబై జట్టును గెలిపించిన హర్మన్.. తన బ్యాటింగ్ ఎందుకు ప్రత్యేకమో మరోసారి నిరూపించింది. ఈ గెలుపుతో ముంబై జట్టు వరుసగా ఐదు విజయాలను నమోదు చేసుకుంది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. హర్మన్ విధ్వంసకరమైన ఆట తీరు నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె పేరు తెగ చక్కర్లు కొడుతోంది.