World Cup 2023 Qualifier: వరల్డ్ కప్ కు క్వాలిఫై కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఘన విజయం సాధించింది. సూపర్ సిక్స్ లో భాగంగా సోమవారం ఒమన్ తో నెదర్లాండ్స్ జట్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు కప్ మ్యాచ్ లకు అర్హత సాధిస్తుంది. అంతటి కీలకమైన మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టి ఘన విజయం సాధించింది.
వరల్డ్ కప్ క్వాలిఫై మ్యాచ్ లు హరారే వేదికగా కొద్ది రోజుల నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ ల్లోనే వెస్టిండీస్ జట్టు అనామక జట్లుపై ఓటమిపాలై వరల్డ్ కప్ ఆశలను గల్లంతు చేసుకుంది. వెస్టిండీస్ జట్టు ఆశలు అడియాశలు కావడంతో.. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. దీంతో సోమవారం ఒమన్ తో జరిగిన మ్యాచ్ నెదర్లాండ్స్ కు అత్యంత కీలకంగా మారింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి విజయం సాధించడం ద్వారా వరల్డ్ కప్ బెర్త్ కు పోటీలో నిలిచారు.
విధ్వంసం సృష్టించిన విక్రమ్ జీత్ సింగ్.. భారీ లక్ష్యం..
ఈ మ్యాచ్ లో తోలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు అదరగొట్టింది. వర్షం వల్ల మ్యాచ్ కు మధ్యలో అంతరాయం కలగడంతో 48 ఓవర్లకు మ్యాచును కుదించారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ 11 ఫోర్లు, రెండు సిక్సుల సహాయంతో 109 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఒమన్ బౌలర్లను చీల్చి చండాడిన వెస్లీ బరేసి 65 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సుల సహాయంతో 97 పరుగులు చేశాడు. వీరితోపాటు మరి కొంతమంది ఆటగాళ్లు రాణించడంతో ఏడు వికెట్ల నష్టానికి నెదర్లాండ్స్ జట్టు 362 పరుగులు చేసింది. ఈ దశలో మళ్లీ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో ఒమన్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే, ఒమన్ 44 ఓవర్లలో ఆరు వికెట్లకు 246 పరుగులు మాత్రమే చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టులో కీలక ఆటగాళ్లు రాణించలేకపోయారు. అయాన్ ఖాన్ 92 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సుల సహాయంతో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒంటరి పోరాటం చేసిన ఫలితం దక్కలేదు. దీంతో నెదర్లాండ్స్ జట్టు 74 పరుగులు తేడాతో విజయం సాధించింది.
ఆ మూడు జట్లలో రెండో బెర్త్ ఎవరికి దక్కేనో..
భారత్ వేదికగా జరుగునున్న వరల్డ్ కప్ కు ర్యాంకుల ఆధారంగా ఇప్పటికీ ఎనిమిది జట్లు అర్హత సాధించాయి. మిగిలిన రెండు జట్ల కోసం క్వాలిఫై మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. సూపర్ సిక్స్ కు చేరుకునేసరికి శ్రీలంక జట్టు ఒక బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్స్, నెదర్లాండ్స్ జట్లు పోటీపడుతున్నాయి. మంగళవారం స్కాట్లాండ్ తో చివరి సూపర్ సిక్స్ మ్యాచును జింబాబ్వే ఆడనుంది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే విజయం సాధిస్తే మిగిలిన మ్యాచ్ ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్ జట్టు విజయం సాధిస్తే మాత్రం.. జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్ తర్వాతే రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో అన్నది ఖరారు కానుంది.