WPL 2023 UP Vs Mumbai: ఒక జట్టు ఏమో వరుస విజయాలు సాధించి.. చివరిలో తడబడింది.. మరొక జట్టు ఏమో మొదట్లో తడబడి… చివరిలో పుంజుకుంది. ఆ రెండు జట్లు ఇప్పుడు కప్ వేటలో ముందడుగు వేయాలంటే తలపడాలి.. విజయమో వీర స్వర్గమో తెల్చుకోవాలి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ముగింపు దశకు చేరుకొంది. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. వరుస ఐదు విజయాలతో నాకౌట్ బెర్త్‌ను ముందుగానే కైవసం చేసుకొన్నా.. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో తడబాటు కారణంగా నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని హర్మన్‌ప్రీత్ సేన చేజార్చుకొంది. కానీ, లీగ్‌లో ముంబై ప్రదర్శన ఆకట్టుకొనే తీరిలో సాగింది. ఆరంభ మ్యాచ్‌లోనే భారీస్కోరుతో అంచనాలను అమాంతం పెంచేసింది.
మిడిల్ నుంచి సహకారం లేదు
అయితే, ముంబై టాపార్డర్‌లో యాస్తిక, హీలే మాథ్యూస్, స్కివర్ బ్రంట్ మెరుగ్గా రాణిస్తున్నా.. మిడిలార్డర్‌లో హర్మన్ మినహా మిగతా వారి నుంచి తగినంత సహకారం అందడం లేదు. టాప్ విఫలమైతే భారమంతా హర్మన్‌పైనే పడుతోంది. బ్రంట్, సైకా ఇషాక్, మాథ్యూస్, వాంగ్‌లతో బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. రెండోసారి యూపీ, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసి తక్కువ స్కోర్లకే పరిమితం కావడంతో ముంబైకి ఓటములు తప్పలేదు. ఇక, చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరుపై 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ జట్టు కష్టపడింది. అనుభవజ్ఞులైన ప్లేయర్లు జట్టులో ఉండడం మాత్రం ముంబైకి బలం.
పడుతూ లేస్తూ సాగినా..
కాగా, ప్రత్యర్థితో పోల్చితే అలిసా హీలీ సార థ్యంలోని యూపీ ప్రయాణం పడుతూ లేస్తూ సాగినా.. కీలక సమయంలో పుంజుకొంది. టాపార్డర్ పేలవంగా కనిపిస్తున్నా.. గ్రేస్ హ్యారిస్, తలియా మెక్‌గ్రాత్, ఎకిల్‌స్టన్‌తో మిడిలార్డర్ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తోంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కిరణ్ నవగిరి, అంజలి శర్వాణీ టీమ్ నమ్మదగ్గ ప్లేయర్లుగా ఎదుగుతున్నారు. అయితే, కీలక మ్యాచ్‌కు ముందు హ్యారిస్ ఫిట్‌నెస్ పై అనుమానాలు జట్టును ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముంబైపై ఒకసారి ఓడినా.. యూపీ రెండోసారి నెగ్గింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.