Rohit Sharma And Virat Kohli: ఈ సిరీస్ కంటే ముందు టీమిండియా కేవలం ఒకే ఒక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంకతో తలపడిన ఆ వన్డే సిరీస్ లో టీమిండియా ఓటమిపాలైంది. దాదాపు 30 సంవత్సరాల అనంతరం శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్ అప్పగించింది. ఆ తర్వాత టీమిండియా మళ్లీ వన్డే మ్యాచ్లు ఆడలేదు. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. టీమిండియా ఈ సిరీస్ గనక గెలిస్తే చాంపియన్స్ ట్రోఫీకి ముందు అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవచ్చు. అంతేకాదు హైబ్రిడ్ విధానంలో సాగే ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాకడానికి అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు.. అయితే ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడరని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.
జాతీయ మీడియా వార్తల ప్రకారం
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారట. వాస్తవానికి వీరు విశ్రాంతి తీసుకుంటారని.. హార్దిక్ పాండ్యా వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడని.. విరాట్ కోహ్లీ కూడా ఆడతాడని బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. ఫిబ్రవరి 19న ఈ సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్లో సత్తా చాటడానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తహతహలాడుతున్నారు. ఎందుకంటే కొంతకాలంగా వీరిద్దరూ సరైన ఫామ్ లో లేరు. దీంతో తమపై వస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు బలమైన సమాధానం చెప్పాలని వీరిద్దరూ భావిస్తున్నారు. అయితే బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో అతడు ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీ లోనే ఆడతాడని జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 6, 9, 12 తేదీలలో భారత జట్టు ఇంగ్లాండుతో తలపడుతుంది. గత ఏడాది జనవరి నెలలో ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో టీమిండియా 4-1 తేడాతో గెలిచింది. తొలి టెస్ట్ లో బజ్ బాల్ క్రికెట్ ఆడి ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించగా.. ఆ తర్వాత నాలుగు టెస్టులలో టీమిండియా రెచ్చిపోయి ఆడింది. వీర విహారం చేసి ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. నాలుగు టెస్టుల్లో ఏకపక్ష విజయం సాధించి సిరీస్ దక్కించుకుంది. అయితే బంగ్లాదేశ్ వరకు టీమిండియా ఇదే జోరు కొనసాగించినప్పటికీ.. న్యూజిలాండ్ చేతిలో మూడు, ఆస్ట్రేలియా చేతిలో మూడు మ్యాచ్లలో ఓటమి పాలు కావడం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ అవకాశాలను నాశనం చేసుకుంది. హ్యాట్రిక్ రికార్డు సాధించాలని కలను సాకారం చేసుకోలేకపోయింది. గత రెండు సీజన్లో ఐసిసి టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లిన టీమిండియా.. ఈసారి మాత్రం వెళ్లలేకపోయింది. తొలిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో భారత్ వరల్డ్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఓటమిపాలైంది.