https://oktelugu.com/

Paris Olympics: రాజకీయ అనిశ్చితి.. ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం.. పారిస్ ఒలింపిక్స్ జరుగుతాయా?

టోక్యో తర్వాత ప్రస్తుతం పారిస్ లో ఒలింపిక్స్ పోటీలను జూలై 15 నుంచి నిర్వహించనున్నారు. 1900, 1924 సంవత్సరాలలో ఫ్రాన్స్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుతం వందేళ్ల తర్వాత మళ్లీ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. విశ్వ క్రీడలు కావడంతో ఘనంగా నిర్వహించేందుకు ఫ్రాన్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఒలింపిక్స్ నేపథ్యంలో పారిస్ లో ప్రవహించే సెన్ నది ని ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 11, 2024 / 12:17 PM IST

    Will Paris Olympics take place

    Follow us on

    Paris Olympics : క్రీడా గ్రామాల కోసం ఇళ్లు కోల్పోయిన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..సెన్ నదిలో నీటిని నాణ్యత పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.. గోటి చుట్టూ రోకటి పోటులా దేశంలో రాజకీయ అనిశ్చితి ఇబ్బంది పెడుతోంది. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు.. ఎప్పట్లో ఏర్పడుతుందో అంతుపట్టడం లేదు. ఈ కారణాలన్నీ ఒలింపిక్స్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఇన్ని ప్రతిబంధకాల మధ్య పారిస్ లో ఒలింపిక్స్ సక్రమంగా సాగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వల్ల 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత 2021లో టోక్యో ప్రాంతంలో ఒలింపిక్స్ నిర్వహించారు. మైదానాలలోకి ప్రేక్షకులను అనుమతించకపోవడంతో టోర్నీ మొత్తం నిరాశ జనకంగా సాగింది

    టోక్యో తర్వాత ప్రస్తుతం పారిస్ లో ఒలింపిక్స్ పోటీలను జూలై 15 నుంచి నిర్వహించనున్నారు. 1900, 1924 సంవత్సరాలలో ఫ్రాన్స్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుతం వందేళ్ల తర్వాత మళ్లీ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. విశ్వ క్రీడలు కావడంతో ఘనంగా నిర్వహించేందుకు ఫ్రాన్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఒలింపిక్స్ నేపథ్యంలో పారిస్ లో ప్రవహించే సెన్ నది ని ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు. అయితే ఈ నదిలో నీటిలో నాణ్యత సరిగ్గా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలను ఈసారి సెన్ నది ఆరు బయట నిర్వహించనున్నారు .. ముగింపు వేడుకలను కూడా ఇక్కడే జరపనున్నారు.

    మారథాన్, స్విమ్మింగ్, ట్రయథ్లాన్ స్విమ్మింగ్.. వంటి ఓపెన్ వాటర్ పోటీలను సెన్ నదిలో నిర్వహించనున్నారు. ఈ నదిలో నీటి నాణ్యత ఆశించినంత స్థాయిలో లేదు. ఈ నదిలోకి మురుగునీరు, వర్షాలు కురిసినప్పుడు వరద నీరు వస్తోంది. అందువల్ల నదిలో నీటి నాణ్యత దారుణంగా ఉంది. పైగా 1923 నుంచి ఈ నదిలో స్నానం చేయడంపై ఫ్రాన్స్ ప్రభుత్వం నిషేధం విధించింది. నదిలో నీటి నాణ్యత సరిగా లేకపోవడంతో అథ్లెట్లు ఇందులో ఈత కొట్టడం శ్రేయస్కరం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోటీలకు మరికొద్ది రోజులే సమయం ఉన్న నేపథ్యంలో.. ఈ నదిలో నీటి నాణ్యతను ఏ విధంగా పెంచుతారనేది ప్రశ్నార్థకంగా ఉంది. పోటీల సమయానికి నీటి నాణ్యత సరిగ్గా లేకపోతే నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ పోటీలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల సంఖ్యను ఆరు నుంచి మూడు లక్షలకు తగ్గించారు.

    ఫ్రాన్స్ పార్లమెంటును గత నెలలో రద్దు చేశారు. అధ్యక్షుడు మేక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాల్లో శూన్య వాతావరణం ఏర్పడింది. రెండుసార్లు నిర్వహించిన ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో అక్కడ అనిశ్చితి నెలకొన్నది. మరోవైపు ఫారీస్ నగరానికి చెందిన 44 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై సుముఖంగా లేరు. క్రీడా గ్రామాల నిర్మాణం వల్ల వేలాదిమంది నిర్వాసితులుగా మారారు. దీంతో వారంతా ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పారిస్ నగరంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇవి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒలింపిక్స్ పోటీల సమయంలో ఉచిత ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తామని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఆ దేశంలో ప్రజా రవాణా చార్జీలు విపరీతంగా పెరిగాయి. పారిస్ నగరంలో మెట్రో సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో విస్తరించలేదు. మరి ఇన్నేసి సమస్యల మధ్య ఒలింపిక్స్ ఎలా సాధ్యమవుతుందో నిర్వాహకులకే తెలియాలి.