BCCI Central Contracts: ఇంగ్లాండ్ పై మెరుపులు మెరిపించినా.. సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కలేదు

సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. వీరు ప్రతిభావంతమైన ఆటగాళ్లే అయినప్పటికీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల బారిన పడటంతో వారికి అవకాశం లభించింది.

Written By: Suresh, Updated On : February 29, 2024 12:24 pm
Follow us on

BCCI Central Contracts: బీసీసీఐ 2023-2024 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు లేకపోవడంతో వివాదం చెలరేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిని మర్చిపోకముందే సెంట్రల్ కాంట్రాక్టులో యువ ఆటగాళ్లు ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ కు చోటు దక్కకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి వీరిద్దరూ ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడుతున్నారు. ముఖ్యంగా రాంచి వేదికగా జరిగిన నాలుగవ టెస్టులో ధృవ్ జురెల్ అద్భుతమైన ప్రతిభ చూపాడు. అతడు నిలబడటం వల్లే నాలుగో టెస్ట్ భారత్ గెలిచింది. అతడు ఆడుతున్న తీరును చూసి సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు మహేంద్రసింగ్ ధోనితో పోల్చుతున్నారు. అలాంటి ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కకపోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. వీరు ప్రతిభావంతమైన ఆటగాళ్లే అయినప్పటికీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల బారిన పడటంతో వారికి అవకాశం లభించింది. తన ఫస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లో సర్ఫరాజ్ ఖాన్ 2 హాఫ్ సెంచరీలు బాదాడు. ముఖ్యంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా వల్ల రన్ అవుట్ అయ్యాడు కానీ.. లేకుంటే అతడు సెంచరీ సాధించేవాడు. ఇక నాలుగో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ విఫలమైనప్పటికీ ధృవ్ జురెల్ అద్భుతంగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్ లో 10 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోతున్న సమయంలో బౌలర్లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తన అసాధారణ బ్యాటింగ్ తో నాలుగో టెస్ట్ ను భారత్ వైపు మళ్ళించాడు. రెండవ ఇన్నింగ్స్ లోనూ మొండిగా నిలబడి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అయితే వీరికి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కుతుందని అందరూ భావించారు. నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కించుకోవాలంటే భారత జట్టు తరఫున మూడు టెస్టులు లేదా ఎనిమిది వందలు, పది టి20 లు ఆడాల్సి ఉంటుంది. సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడారు. ఇక మార్చి 7 నుంచి ధర్మశాల వేదిక ప్రారంభమయ్యే ఐదవ టెస్టులో వీరిద్దరూ బరిలోకి దిగితే మూడు టెస్టులు ఆడిన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. అప్పుడు వీరికి సి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కోచ్ రాహుల్ ద్రావిడ్ అండదండలు వీరిద్దరికీ పుష్కలంగా ఉండడంతో కచ్చితంగా కాంట్రాక్ట్ దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.