MS Dhoni cry : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ప్రయాణం అత్యంత విజయవంతమైనదిగా చెప్పవచ్చు. ఈ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ కప్ సాధించగా, అనేకసార్లు ప్లే ఆఫ్ వరకు వెళ్ళింది. కొన్నిసార్లు ఫైనల్లో కూడా ఓటమిపాలైంది. ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన సారధుల్లో ధోని ఒకడు. మానసికంగా బలంగా ఉండే ధోని ఒకానొక సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ధోని కన్నీళ్లు పెట్టుకోవడం ఏమిటి అని అనుకుంటున్నారా..? అయితే అదేంటో మీరూ చదివేయండి.
మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రపంచంలో ఒక ఐకాన్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ధోనీని పూజిస్తుంటారు. మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే ధోని.. మానసికంగానూ ఎంతో బలంగా ఉంటాడు. అయితే అటువంటి ధోని ఒక సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా. కానీ ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా మాజీ ఇండియన్, చెన్నై జట్టు క్రికెటర్ హర్భజన్ సింగ్ బయట పెట్టాడు.
అందుకే ధోనీకి కెప్టెన్ కూల్ అంటారు..
మైదానంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ధోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ మెలుగుతుంటాడు. జట్టు సాధించే విజయాలకు పొంగిపోడు.. అపజయాలకు కృంగిపోడు. రెండింటినీ ఒకే విధంగా తీసుకుంటాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహాలను పన్నడంలో ధోనీకి మించిన వాళ్లు మరొకరు ఉండరు. అందుకే ఫ్యాన్స్ ధోనీని కెప్టెన్ కూల్ అంటారు. అటువంటి ధోని ఒక సందర్భంలో మాత్రం కన్నీళ్లను పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని టీమ్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయట పెట్టాడు. రెండేళ్ల నిషేధం తర్వాత 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనం చేసినప్పుడు ఈ సంఘటన జరిగిందని వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో సీఎస్కే మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహీర్ కూడా పాల్గొన్నాడు.
హర్భజన్ సింగ్ ఏం చెప్పాడంటే..
తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ‘ మీతో నేను ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. రెండు సంవత్సరాల నిషేధం తర్వాత 2018లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లోకి పునరాగమనం చేసింది. ఆ రోజు టీమ్ డిన్నర్ లో ఎంఎస్ ధోని కన్నీరు పెట్టుకున్నాడు. అతడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. దీని గురించి ఎవరికీ తెలియదని అనుకుంటున్నాను. నిజమే కదా ఇమ్రాన్ తాహీర్..’ అని హర్భజన్ సింగ్ అన్నాడు. దీనికి ఇమ్రాన్ తాహీర్ స్పందిస్తూ.. ‘అవును ఇది నిజమే. నేను కూడా అక్కడే ఉన్నాను. అది అతనికి చాలా ఎమోషనల్ మూమెంట్. అతనిని అలా చూస్తుంటే ఈ జట్టు అతని హృదయానికి ఎంత దగ్గరగా ఉందో నాకు తెలిసింది. జట్టును ధోని తన కుటుంబంలా భావిస్తాడు. ఇది మనందరినీ చాలా భావోద్వేగానికి గురి చేసింది’ అని పేర్కొన్నాడు.
హేళనలపై స్పందించిన తాహీర్..
2018 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అనేక విమర్శలను ఎదుర్కొంది. అంతా వెటరన్ ఆటగాళ్లతో జట్టు నిండి ఉండడంతో చాలా మంది డాడీస్ ఆర్మీ అని హేళన చేసిన విషయం తెలిసింది. ఈ తరహా విమర్శలు పెద్ద ఎత్తున అప్పట్లో వచ్చాయి. తాజా షోలో ఇమ్రాన్ తాహీర్ దీని గురించి కూడా మాట్లాడాడు. మేము రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసి టోపీని గెలుచుకున్నామన్నాడు. కొంత మంది మా జట్టు వృద్ధుల జట్టు అని ట్యాగ్ ఇచ్చారని, కానీ మేము టైటిల్ గెలుచుకున్నామని వెల్లడించాడు. ఆ విజయానికి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ తాహీర్ వివరించాడు.