WPL 2024: ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలా మంది క్రీడాకారులు ఆటల్లో రాణించలేక పోతారు. చివరికి ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతుంటారు. కానీ కొందరికి ఆటల్లో, ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ.. అనేక కష్టాలను ఎదుర్కొంటూ పైకి వస్తారు. తాము ఎంచుకున్న క్రీడా రంగాల్లో విశేషమైన ప్రతిభ చూపుతారు. అలాంటి కోవకే చెందుతుంది ఈ క్రీడాకారిణి. పేద కుటుంబం.. తండ్రి రిక్షా కార్మికుడు.. మూడు పూటలా తిండి దొరకడమే గగనం.. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఓ యువతి విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటింది. ఆరంభ మ్యాచ్ లో తన బ్యాటింగ్ శైలితో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -24 సీజన్ లో శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్ రసవత్తరంగా ముగిసింది. అభిమానులకు అసలు సిసలైన టి20 క్రికెట్ మజాను అందించింది. శుక్రవారం రాత్రి ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. అభిమానులను సీట్ చివరి ఎడ్జ్ లో కూర్చోపెట్టిన ఈ మ్యాచ్లో సజీవన్ సజన అనే క్రీడాకారిణి చివరి బంతిని సిక్స్ గా మలచి ముంబై జట్టును గెలిపించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 19 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై విజయానికి చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను ఢిల్లీ కెప్టెన్ లానింగ్ ఆఫ్ స్పిన్నర్ క్యాప్సికి అప్పగించింది. దీంతో క్యాప్సి వేసిన తొలి బంతికి పూజా ఔట్ అయింది. దీంతో ఢిల్లీ జట్టులో సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు ముంబై జట్టులో ఒత్తిడి ప్రారంభమైంది. తొలి బంతికే పూజ అవుట్ కావడంతో ముంబాయి విజయ సమీకరణం ఐదు బంతులకు 12 పరుగులుగా మారింది. ఈ క్రమంలో రెండో బంతికి రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతికి అమన్ జోత్ కౌర్ సింగిల్ తీసి హార్మన్ ప్రీత్ కౌర్ స్ట్రైక్ ఇచ్చింది. నాలుగో బంతిని హార్మన్ ఫోర్ గా మలిచింది. దీంతో ముంబై విజయ సమీకరణం ఐదు పరుగులకు తగ్గింది. అయితే ఐదో బంతికి అనూహ్యంగా హార్మన్ ఔట్ అయింది. దీంతో ఒక్కసారిగా ముంబై అభిమానులు సైలెంట్ అయిపోయారు. ముంబై విజయానికి ఒక బంతికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో సజీవన్ సజన క్రీజ్ లోకి వచ్చి చివరి బంతిని సిక్స్ గా మలచింది. ఫలితంగా ముంబై జట్టు విజయం సాధించింది.
సజీవన్ సజన చివరి బంతికి సిక్స్ కొట్టి ముంబై జట్టును గెలిపించిన నేపథ్యంలో నెటిజన్లు ఆమె గురించి తెగ శోధిస్తున్నారు. సజీవన్ సజన కు 28 సంవత్సరాలు. కేరళ రాష్ట్రంలోని వాయనాడులోని మనంతవాడి అనే కు గ్రామంలో జన్మించింది. కురిచియా అనే గిరిజనకు చెందిన సజనకు.. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సజన తండ్రి రిక్షా డ్రైవర్. అతడు పొద్దంతా పనికి వెళ్తేనే ఆమె కుటుంబం మూడు పూటలా అన్నం తింటుంది. లేకుంటే అంతే సంగతులు.. తనది పేద కుటుంబం అయినప్పటికీ సజన కెరియర్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆమె తండ్రి ప్రోత్సహించాడు. తన కూతురు క్రికెట్ వైపు అడుగులు వేయడంలో కష్టపడ్డాడు. సజన ప్రస్తుతం దేశవాళి క్రికెట్లో కేరళ జట్టుకు ఆడుతోంది. సౌత్ జోన్, ఇండియా – ఏ జట్ల తరఫున ఆమె ఆడింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తొలి సంవత్సరం సజన ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఈ ఏడాది జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు సజన ను కొనుగోలు చేసింది. పది లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన ఆమెను 15 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. రెండవ సీజన్ తొలి మ్యాచ్ లోనే తన జట్టును గెలిపించి.. తాను ఎంత ప్రమాదకార క్రీడాకారిణి నో మిగతా జట్లకు సంకేతాలు పంపింది.
!
5 off 1 needed and S Sajana seals the game with a MAXIMUM very first ball
A final-over thriller in the very first game of #TATAWPL Season 1
Scorecard https://t.co/GYk8lnVpA8#TATAWPL | #MIvDC pic.twitter.com/Lb6WUzeya0
— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024