RCB Bowling Coach: ఐపీఎల్ లో ముంబై, చెన్నై కి తీసిపోని జట్టు బెంగళూరు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా.. ఆ జట్టు పరిస్థితి ఉంటుంది. కీలకమైన సమయంలో ఓడిపోయి పరువు తీసుకుంటుంది. అందువల్లే ఇంతవరకు ఒక్కసారి కూడా కప్ సాధించలేకపోయింది. ప్రతిసారి సీజన్ ప్రారంభం కావడం.. కప్ గెలుస్తుందని భావించడం.. కీలక దశలో ఓడిపోవడం.. ఇవన్నీ బెంగళూరు జట్టుకు పరిపాటిగా మారాయి.
అయితే 2025 సీజన్ అలా ఉండకూడదని.. ఈసాలా కప్ నమదేనని బెంగళూరు జట్టు అంటున్నది. 2024లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతి మందాన ఆధ్వర్యంలో బెంగళూరు కప్ గెలిచింది. అదే అదే మ్యాజిక్ పురుషుల జట్టు కూడా కంటిన్యూ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ యాదృచ్ఛికంగా కప్ వేటలో బెంగళూరు జట్టు ఎప్పటిలాగే చతికిలపడింది. అయితే 2025 సీజన్ లో అలా ఉండకూడదని భావిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ డూ ప్లేసిస్ కు ఉద్వాసన పలికింది. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. అన్ని అవకాశాలు అనుకూలిస్తే రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. మొత్తంగా చూస్తే 2025లో విజేతగా నిలవాలని బెంగళూరు జట్టు బలంగా భావిస్తున్నది. ఇప్పటినుంచి ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇక త్వరలో జరిగే మెగా వేలంలో మరింతమంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసి విజయవంతమైన జట్టు లాగా బెంగళూరు మార్చాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది.
కొత్త బౌలింగ్ కోచ్
ఇప్పటికే కెప్టెన్ కు ఉద్వాసన పలికిన బెంగళూరు మేనేజ్మెంట్.. బౌలింగ్ కోచ్ విషయంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చింది. కొత్త బౌలింగ్ కోచ్ గా ఓంకార్ సాల్వి ని నియమించింది. ఇందుకోసం అతడికి భారీగానే నజరానాను ముట్ట చెబుతోంది. అతడితో ఐదు సంవత్సరాలపాటు కాంట్రాక్టు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఓంకార్ ప్రస్తుతం ముంబై రంజి జట్టు హెడ్ కోచ్ గా కొనసాగుతున్నాడు. గతంలో అతడు కోల్ కతా సపోర్ట్ స్టాఫ్ లో పని చేశాడు. ఆయన శిక్షణలో ముంబై గత ఏడాది రంజి, ఇరానీ ట్రోఫీలను దక్కించుకుంది. అయితే వచ్చే సంవత్సరం దేశవాళీ సీజన్ ముగిసిన వెంటనే అతడు బెంగళూరు జట్టుతో ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.. ఆటగాళ్లలో సామర్థ్యాన్ని వెలికితీయడంలో ఓంకార్ ది అందవేసిన చేయి. అందువల్లే దేశవాళి క్రికెట్లో అతని పేరు మార్మోగిపోతుంది. అతని ఆధ్వర్యంలో బెంగళూరు బౌలింగ్ మరింత పటిష్టంగా మారుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
దానికోసమే ఈ ప్రయోగాలు..
బెంగళూరు జట్టు లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక దశలో ప్రత్యర్థి జట్టుకు తలవంచుతోంది. దీనివల్ల అవకాశాలను కోల్పోయి ఉత్తి చేతులతో వెళ్ళిపోతోంది. అయితే ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల కసరతులు మొదలుపెట్టింది. మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును మరింత పట్టిష్టవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. కొత్త ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి.. అతడి మార్గదర్శకంలో విజయవంతమైన జట్టు లాగా రూపొందించాలని ప్రణాళికలను రచించింది. ఈ క్రమంలోనే కొత్త బౌలింగ్ కోచ్ ను నియమించుకున్నది.