England Vs Australia 2nd Test: యాషెస్ సిరీస్ లో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు మరోసారి పరాభవం తప్పలేదు. తొలి టెస్ట్ లోను చివరి రోజు చివరి క్షణాల్లో ఓటమిపాలైన ఇంగ్లాండు జట్టు.. రెండో టెస్టులోనూ విజయానికి దగ్గరగా వచ్చి బోల్తా పడింది. బజ్ బాల్ వ్యూహాన్ని అమలు చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు.. ఈ సిరీస్ లో అది కలిసి రావడం లేదు. వికెట్లు పడుతున్న వేగంగా ఆడడమే లక్ష్యంగా పెట్టుకుంటున్న ఇంగ్లాండు జట్టుకు.. ఆ ఆట తీరే ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రణాళిక ప్రకారం ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు.. ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహాన్ని చావు దెబ్బ కొడుతోంది.
ఇంగ్లాండ్ జట్టు గత కొన్నాళ్లుగా అనుసరిస్తున్న బజ్ బాల్ మంత్రం యాషెస్ సిరీస్ లో ఫలితం ఇవ్వడం లేదు. మొదటి టెస్ట్ లోను విఫలమైన ఈ వ్యూహం.. రెండో టెస్టులోనూ బెడిసి కొట్టింది. ఇంగ్లాండ్ జట్టు విజయం కోసం బెన్ స్టోక్స్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 43 పరుగుల తేడాతో రెండో టెస్టులో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఐదు టెస్టుల సిరీస్ లో 2-0 తో లీడ్ సాధించింది.
370 పరుగుల లక్ష్యంతో బరిలోకి..
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 370 పరుగులతో బరిలోకి దిగింది. 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టును.. డకెట్, బెన్ స్టాక్స్ జోడి ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్ కు 132 విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయం దిశగా నడిపించారు. 177 పరుగుల వద్ద డకెట్ అవుట్ కావడంతో.. మళ్లీ ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడినట్టు అయింది. అయితే, కొద్ది పరుగులు జోడించిన తర్వాత జానీ బెయిర్ స్టో కావడంతో మళ్లీ ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో ఇంగ్లాండ్ జట్టు ఓటమి దాదాపు ఖాయమని అనుకున్నారు. అయితే, మరో ఎండ్ లో స్టోక్స్ పోరాటం కొనసాగించడంతో విజయం ఇరుజట్ల మధ్య ధోబూచులాడింది. ఆ తరువాత వచ్చిన స్టువర్టు బ్రాడ్ ఎక్కువసేపు క్రీజులో ఉండే ప్రయత్నం చేయడంతో భారీగా పరుగులు లభించాయి. ఏడో వికెట్ కు స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్ 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో మళ్లీ ఇంగ్లాండ్ జట్టు పోటీలోకి వచ్చింది. అయితే 301 పరుగులు వద్ద స్టోక్స్.. హజల్ వుడ్ బౌలింగ్ లో అలెక్స్ క్యారీ కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ సరిగా ఆడలేకపోవడంతో.. చివరి మూడు వికెట్లను 26 పరుగులు వ్యవధిలో ఇంగ్లాండ్ జట్టు కోల్పోయి 43 పరుగులు తేడాతో ఓటమి పాలయ్యింది. ఇంగ్లాండ్ జట్టులో జాక్ క్రావ్లే 3(6), ఓల్లే పోప్ 3 (10), జో రూట్ 18(35), హ్యారీ బ్రూక్ 4(3), బెయిర్ స్టో 10(22) దారుణంగా విఫలమయ్యారు. బెన్ డకెట్ 83(112), బెన్ స్టోక్స్ 155 (214) మాత్రమే రాణించారు.
కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం..
ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం రెండో ఇన్నింగ్స్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఆస్ట్రేలియా బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్ లో మిచెల్ స్టార్క్ మూడు, పాత్ కమిన్స్ మూడు, జోష్ హజేల్ వుడ్ మూడేసి చప్పున వికెట్లు తీశారు. కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీశారు. ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఉస్మాన్ కవాజా 187 బంతుల్లో 77 పరుగులు, వార్నర్ 76 బంతుల్లో 25 పరుగులు, లబు చేంజ్ 51 బంతుల్లో 30 పరుగులు, స్టీవెన్ స్మిత్ 62 వంతుల్లో 34 పరుగులు, గ్రీన్ 67 బంతుల్లో 18 పరుగులు, అలెక్స్ క్యారీ 73 బంతుల్లో 21 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 10 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ నాలుగు, జోష్ టంగు, రాబిన్షన్ రెండేసి వికెట్లు తీశారు. అండర్సన్, స్టోక్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Web Title: What is the reason for australias victory and englands defeat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com