India Vs West Indies T20 Series
India Vs West Indies T20 Series: క్రికెట్ పసికూన జింబాబ్వేపై టెస్ట్ వన్డే, టి20 సిరీస్‌లు కోల్పోయి.. ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్.. క్రికెట్ అగ్రజట్లలో ఒకటైన భారత్‌ను చిత్తు చేసింది. సొంత గడ్డపై గర్జించిన విడీస్ క్రికెటర్లు.. టీమిండియాపై టెస్ట్, వన్డే సిరీస్ ఓడి బలహీనంగా కనిపించారు. కానీ టి20 స్పెషలిస్ట్ క్రికెటర్లు ఉన్న ఆ జట్టు.. టీ20లో భారత్ సిరీస్ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. ఏడేళ్ల తర్వాత టీమిండియా విండీస్ జట్టుపై సిరీస్ కోల్పోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పుంజుకున్నట్లే కనిపించిన టీమిండియా కీలక మ్యాచ్‌లో భంగపడింది. విండీస్‌తో చివరి టీ20లో ఓడి సిరీస్‌ను 2–3తో కోల్పోయింది. గత మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన అదే వేదికలో భారత్ తగినంత స్కోరు చేయలేకపోగా.. బ్రెండన్ కింగ్, పూరన్ మెరుపులతో కరీబియన్ జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ అర్ధశతకం వృథా అయింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పేలవ బ్యాటింగ్..
బ్యాటింగ్‌లో దూకుడు కొరవడడంతో వెస్టిండీస్‌తో చివరిదైన అయిదో టీ20లో టీమిఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆదివారం జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో మొదట భారత్ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 61 పరుగులు చేశారు. విండీస్ జట్టులో రొమారియో షెఫర్డ్ 31 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా, అతనికి అకీల్ హోసీన్ 2 వికిట్లు తీసి భారత్‌ను కట్టడి చేయడంలో సహకరించాడు. ఇక బ్యాటింగ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ కింగ్ 55 బంతుల్లో 85 నాటౌట్, పూరన్ 35 బంతుల్లో 47 పరుగులతో మెరవడంతో లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. హార్దిక్ పాండ్య సారథ్యంలో భారత్ టీ20 సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి.
అలవోకగా లక్ష ఛేదన..
వెస్టిండీస్ ఛేదనలో రెండో ఓవర్లోనే మేయర్స్(10)ను అర్ష్ష్‌దీప్ ఔట్ చేయడంతో భారత్ సంబరడిపోయింది. కానీ కింగ్‌కు తోడైన పూరన్.. ఆ ఆనందాన్ని ఎంతోసేపు నిలవనివ్వలేదు. తనదైన శైలిలో ధనాధనా బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అర్ష్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓ సిక్స్, హార్ధిక్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు దంచేశాడు. మరోవైపు కింగ్ కూడా చెలరేగడంతో విండీస్ ఏడు ఓవర్లలో 71/1తో బలమైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ సాధికారిక బ్యాటింగ్‌ను కొనసాగించడంతో ఆతిథ్య జట్టు సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. ప్రతికూల వాతావరణం కారణంగా 12.3 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి స్కోరు 117/1. 40 నిమిషాల విరామం తర్వాత ఆట తిరిగి ఆరంభమైంది. ఆ వెంటనే తిలక్ బౌలింగ్‌లో పూరనన్ ఔటైనా విండీస్‌కు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. దూకుడు కొనసాగించిన కింగ్.. హోప్(22 నాటౌట్)తో కలిసి విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.
సూర్య ఒక్కడే..
అంతకుముందు టీమ్‌ఇండియాను వెస్టిండీస్ కట్టడి చేసింది. క్రమం తప్పకుండా వికెట్లు పడ్డా.. భారత్ గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది అంటే కారణం సూర్యకుమార్ కీలక ఇన్నింగ్సే. తిలక్ వర్మ 18 బంతుల్లో 27 మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. గత మ్యాచ్ హీరోలు యశస్వి జైస్వాల్(5), శుభ్‌మన్ గిల్(9) నిరాశపరిచారు. మూడు ఓవర్లలోపే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ బాటపట్టారు. ఇద్దరినీ స్పిన్నర్ అకీల్ హోసీన్ వెనక్కి పంపాడు. తొలి ఓవర్లో జైస్వాల్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. మూడో ఓవర్లో గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. మూడు ఓవర్లలో 17కే రెండు వికెట్లు పడ్డా.. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ 51/2తో నిలిచింది. ఆత్మవిశ్వాసంతో ఆడిన సూర్య.. హోల్డర్ బౌలింగ్‌లో ఫోర్, హోసీన్ బౌలింగ్‌లో సిక్స్ దంచాడు. ఆకట్టుకునే ఆటను కొనసాగించిన తిలక్ మొదటి నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడాడు. జోసెఫ్ బౌలింగ్‌లో ఏకంగా మూడు ఫోర్లు, సిక్స్ దంచేశాడు. మోకాలిని వంచి స్వీప్‌తో డీప్ స్క్వేర్ లెగ్‌లోకి సిక్స్ కొట్టిన తీరును చూసి తీరాల్సిందే. ఆ తర్వాత హోల్డర్ బౌలింగ్‌లో కూడా సిక్స్ కొట్టాడు. కానీ తిలక్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మంచి ఊపుమీదున్న దశలో చేజ్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సంజు శాంసన్(13) ఎక్కువసేపు నిలవలేదు. పేలవ ఫుట్‌వర్క్‌తో మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. హార్దిక్ పాండ్య(14) నిలిచినా క్రీజులో ఇబ్బందిగా కదిలాడు. ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో 7 పరుగులే చేయగలిగాడు. 11 నుంచి 16 ఓవర్ల మధ్య భారత్‌కు 37 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ ఓవర్లలో సూర్య కొట్టిన రెండు సిక్స్‌లు మినహా.. మరో బౌండరీ రాలేదు. 17వ ఓవర్లో హార్దిక్, ఆ తర్వాతి ఓవర్లో జట్టు స్కోరు 140 వద్ద సూర్య నిష్క్రమించడంతో ఇన్నింగ్స్‌కు భారత్ కోరుకున్నంత బలమైన ముగింపు ఇవ్వలేకపోయింది. మొత్తంగా చివరి నాలుగు ఓవర్లలో టీమ్‌ఇండియా అయిదు వికెట్లు చేజార్చుకుంది.
మొత్తంగా ఏడేళ్ల తర్వాత టీమిండియా సిరీస్ కోల్పోయింది. వరల్డ్ కప్‌కు ముందు ఈ పరాభవంపై బీసీసీఐ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. వరల్డ్ కప్ కొట్టే భారత జట్టు అయితే కచ్చితంగా ఇది కాదు.
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Read MoreWeb Title: West indies beat india by eight wickets to clinch the series 3 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com