https://oktelugu.com/

Narendra Modi Stadium IPL 2023: ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోడీ స్టేడియంలో ‘జలపాతం’.. చూసి తీరాల్సిందే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇక్కడ కురిసిన వర్షంతో ఈ మైదానం గొప్ప ఏమిటో అందరికీ అర్థం అయిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్పా..

Written By:
  • BS
  • , Updated On : May 30, 2023 / 06:24 PM IST

    Narendra Modi Stadium IPL 2023

    Follow us on

    Narendra Modi Stadium IPL 2023: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నరేంద్ర మోడీ స్టేడియానికి గుర్తింపు ఉంది. ఇంత పెద్ద స్టేడియంలో అతిపెద్ద జలాశయం కూడా ఉంది. స్టేడియంలో జలపాతం ఏమిటి అని ఆలోచిస్తున్నారా. అవును మీరు విన్నది నిజమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సిన ఆదివారం, మరుసటి రోజుకు వాయిదా పడిన సోమవారం ఈ స్టేడియంలో కురిసిన వర్షాలకు చిన్నపాటి జలపాతమే ఇక్కడ కనిపించింది. ఇప్పుడు ఇదే సామాజిక మాధ్యమాల వేదికగా బీసీసీఐతో పాటు కేంద్రాన్ని నెటిజన్లు దుమ్మెత్తి పోసేలా చేసింది.

    ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ పేరుతో ఆధునీకరించిన మైదానానికి పేరు ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికపై జరిగింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఫైనల్ మ్యాచ్ రోజు ఇక్కడ ఆధునీకరించిన మైదానం గొప్పతనం అంతా తేలిపోయింది. చిన్నపాటి వర్షం పడితే నీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా మైదానంలోనే నిండిపోయేలా మహా గొప్పగా స్టేడియాన్ని ఆధునీకరించారంటూ ఆరోజు పరిస్థితిని చూసిన ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు.

    1.30 లక్షల మంది వీక్షించేలా ఆధునీకరణ..

    అహ్మదాబాద్ లోని సబర్మతి నదీ సమీపంలో ఉన్న మొతేరా ప్రాంతంలో నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది. ఈ స్టేడియాన్ని తొలుత 1982లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో 49 వేల మంది అభిమానులు వీక్షించేందుకు అణువుగా నిర్మించారు. అయితే, 2017 అక్టోబర్ లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్ వేదిక నిర్మించాలని సంకల్పించారు. సుమారు రూ.800 కోట్ల రూపాయల వ్యయంతో మొతేరా స్టేడియాన్ని పునర్నిర్మించారు. 2020 ఫిబ్రవరిలో ఈ నిర్మాణం పూర్తవ్వడమే కాకుండా సుమారు 1.30 లక్షల మంది అభిమానులు క్రికెట్ వీక్షించేందుకు సౌకర్యంగా దీన్ని విస్తరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గా ఉన్న స్టేడియం పేరును 2020 తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంగా మార్పు చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 90 వేల సీటింగ్ కెపాసిటీ ఉండగా దాన్ని మించి 1.3 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా నిర్మించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా గుర్తింపు వచ్చింది. ఈ స్టేడియం సుమారు 63 ఎకరాల్లో, నాలుగు ఎంట్రీ పాయింట్లతో విస్తరించింది. స్టేడియం విస్తీర్ణం మొత్తం 180×150 అడుగుల పొడవు, వెడల్పుతో ఉంది. ఒకేసారి నాలుగు జట్లకు డ్రెస్సింగ్ రూమ్స్ సౌకర్యం కల్పించే సదుపాయం ఈ స్టేడియం సొంతం. ఈ స్టేడియంలో మొత్తం ఆరు ఇండోర్ ప్రాక్టీస్ పిచ్ లు, మూడు అవుట్ డోర్ ప్రాక్టీస్ పిచ్ లు ఉన్నాయి.

    ఆర్భాటం తప్ప.. అంత లేదు ఇక్కడ..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇక్కడ కురిసిన వర్షంతో ఈ మైదానం గొప్ప ఏమిటో అందరికీ అర్థం అయిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్పా.. ఇక్కడ ఆ స్థాయిలో సౌకర్యాలు లేవన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నపాటి వర్షానికి జలపాతంగా మారిపోయిన ఈ మైదానం అంతర్జాతీయ స్థాయి మైదానంగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. స్టేడియంలో చేరిన నీటిని ఆరబెట్టేందుకు అత్యాధునిక మిషన్లు అనేక దేశాల్లో ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో ఇటువంటి మిషన్లే ఉపయోగిస్తారు. కానీ, నరేంద్ర మోడీ మైదానంలో డ్రయ్యర్లతో ఆర బెట్టడంతోపాటు డస్టర్లతో నీటిని తోడి బయటకు పోయాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. వర్షం పడితే బయటకు నీరు వెళ్లేలా చేయాల్సిన నిర్వాహకులు.. నీరు మొత్తం మైదానంలోకి వచ్చేలా నిర్మాణ పనులు చేయడం అత్యంత దారుణమైన పరిస్థితికి అద్దం పడుతోంది. రూ.800 కోట్ల రూపాయలతో ఆధునీకరించి కనీస స్థాయిలో కూడా ఇక్కడ పనులు చేపట్టలేకపోయారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిన అభిమానులతోపాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి లైవ్ లో చూసిన క్రికెట్ అభిమానులు ఇదేనా అంతర్జాతీయ మైదానం అంటూ నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వర్షం తరువాత కనిపించిన దృశ్యాలతో ఏర్పడింది. ఇక దీనిపై రాజకీయ విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వర్షం వస్తే ఒక మైదానాన్ని నిర్వహించలేకపోయిన వాళ్ళు.. దేశాన్ని ఏమి నిర్వహిస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రియాంక గాంధీ అయితే ఏకంగా ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు పెట్టి వీరి వైఫల్యాన్ని తూర్పారబట్టింది.