
ఐపీఎల్ ముగిసింది. ఐపీఎల్ లోని వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు వారి దేశానికి వెళ్లడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం తలుపులు మూసేసింది. భారత్ లో కరోనా కల్లోలం దృష్ట్యా మే 15 వరకు ఇండియా నుంచి విమానాల రాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం మూసివేసింది. దీంతో భారత్ లోని ఆస్ట్రేలియా క్రికెటర్లు అంతా కూడా పక్కనే ఉన్న మాల్దీవులకు వెళ్లారు. అక్కడి పర్యాటక ప్రాంతంలో సేదతీరుతున్నారు.
మాల్దీవుల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఇతర సిబ్బంది, వ్యాఖ్యాతలు ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే మాల్దీవుల్లో ఉన్న ఓ బార్ లో ఎస్ఆర్.హెచ్ ఆటగాడు డేవిడ్ వార్నర్, ప్రఖ్యాత వ్యాఖ్యాత మైఖేల్ స్లేటర్ మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరు కొట్టుకున్నారని ఓ అంతర్జాతీయ పత్రికలో వార్తలు వచ్చాయి. ఇది పెద్ద దుమారం రేగింది. దీనిపై వార్నర్, స్లేటర్ వివరణ ఇచ్చారు.
తాము మాల్దీవుల్లో గొడవ పడ్డామనే వార్తలు నిజం కాదని ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, మైఖేల్ స్లేటర్ స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. అవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేశారు.
వార్నర్ నాకు మంచి స్నేహితుడు అని.. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని స్లేటర్ స్వయంగా వివరించాడు. ఇక వార్నర్.. ‘ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందో చూడకుండా.. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారని ’ వార్నర్ సదురు మీడియాను నిలదీశాడు.