IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్ లో అత్యంత సమతుల్యత కలిగిన జట్లలో ఆ జట్టు ఒకటని ఒకప్పటి భారత జట్టు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఈ సీజన్ లో ఆడుతున్న పలు జట్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఒక జట్టుపై ప్రశంసలు కురిపించాడు సెహ్వాగ్. అసలు ఆ జట్టు ఏది..? సెహ్వాగ్ ఎందుకు ప్రశంసలు కురిపించాడో చూద్దాం.
ఐపీఎల్ 16వ ఎడిషన్ లీగ్ మ్యాచ్ లు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం పలు జట్ల మధ్య ప్లే ఆఫ్ రేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023లో అత్యంత సమతుల్యత కలిగిన జట్టు ఏదో మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చెప్పాడు. అయితే ఆ జట్టు పాయింట్ల పట్టికలో ముందంజలో ఉన్న గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ కాకపోవడం గమనార్హం. వీటికి భిన్నంగా మరో జట్టును సమతుల్యత కలిగిన జట్టుగా సెహ్వాగ్ పేర్కొనడం విశేషం.
వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నారంటే..
ఈ టీమిండియా మాజీ డాన్సింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుత ఐపీఎల్ లో ఆడుతున్న ఒక జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టును మోస్ట్ బ్యాలన్స్ డ్ టీమ్ గా సెహ్వాగ్ పేర్కొన్నాడు. ‘ఈ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ అత్యంత సమతుల్యత కలిగిన జట్టలో ఒకటని నేను అనుకుంటున్నాను. ఆ జట్టు బయట మైదానాల్లో అద్భుతంగా రాణిస్తోంది. అయితే, హోమ్ గ్రౌండ్ లో ఆశించిన స్థాయిలో ఆడటం లేదు’ అని సెహ్వాగ్ ఓ ఛానల్ తో విశ్లేషించాడు. ఇక లక్నో జట్టు హైదరాబాద్ జట్టుతో ఉప్పల్ మైదానంలో జరిగిన కీలక పోరులో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
నాలుగో స్థానంలో ఉన్న లక్నో జట్టు..
లక్నో జట్టు హైదరాబాద్ పై విజయంతో పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లక్నో జట్టు 12 మ్యాచ్ లు ఆడగా ఆరు విజయాలు నమోదు చేసింది. మరో ఐదు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కాగా, ఒక మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ సాధించింది. దీంతో మొత్తంగా 12 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టు మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ముంబై, కోల్కతాలతో తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు చేరే అవకాశం ఉంది. చూడాలి మరి మిగిలిన రెండు మ్యాచ్ లను లక్నో జట్టు ఏ విధంగా ఫినిష్ చేస్తుందో.