
భారత క్రికెట్లోనే కాదు.. ప్రపంచ క్రికెట్లో కూడా దూకుడుకు మారుపేరు ఎవరంటే.. కోహ్లీ అని అంటారు చాలా మంది. మైదానంలో మనోడి ఆటతీరు కూడా అదేవిధంగా ఉంటుంది. బ్యాట్ తో పరుగుల సునామీ సృష్టించే విరాట్.. ఫీల్డింగ్ సమయంలోనూ మైదానంలో ఆద్యంతం రెచ్చిపోయి ఆడుతుంటాడు. ఫైనల్ గా లక్ష్యం గెలుపే అన్నట్టుగా ఆడుతుంటాడు. ఇలాంటి కోహ్లీ.. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ సాగుతున్న వేళ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ అనేది చిన్న సమరం ఏమీకాదు. వన్డే ప్రపంచకప్ స్థాయికి పోల్చలేకపోయినా.. గ్రేడ్ మాత్రం అదే. ఐసీసీ నిర్వహించే ట్రోఫీల్లో కొత్తగా చేరింది. దీన్ని సొంతం చేసుకోవడం అంటే.. ప్రపంచ టెస్టు క్రికెట్లో ఛాంపియన్ అని అధికారికంగా చాటుకోవడమే. పైపెచ్చు.. కోహ్లీ కెప్టెన్ అయిన ఐదేళ్లలో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేదు. మరి, ఇలాంటి సమయంలో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ తీరు ఎలా ఉంటుందీ? ఎలా ఉండాలి? కానీ.. విరాట్ మాట్లాడిన తీరు చూస్తే క్రికెట్ ప్రేమికులకు ఆశ్చర్యం కలగక మానదు.
నేటి నుంచి ఇంగ్లండ్ లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో ఇండియా తలపడుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు కోహ్లీ. ప్రపంచ ఛాంపియన్ షిప్ ఓడిపోతే ప్రపంచం ఏమీ ఆగిపోదన్నట్టుగా స్పందించాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ను డిసైడ్ చేసే మ్యాచ్ ను.. ఇది కూడా ఓ సాధారణ మ్యాచ్ అనేశాడు. ఆట అన్నాక ఓటమి, గెలుపు సహజం అంటూ.. వేదాంతం అందుకున్నాడు.
‘‘మేము ఈ ఫైనల్ గెలిచినా, ఓడినా.. మా క్రికెట్ ఇక్కడితో ఆగిపోదు. చరిత్రను పరిశీలిస్తే.. అన్ని జట్లూ.. ఎన్నో మ్యాచులు ఓడిపోయాయి. దీన్ని బట్టి ఇదొక ఆట అని అర్థమవుతుంది. ఇందులో భాగంగానే.. ఈ ఫైనల్ ను మేము ప్రత్యేకంగా చూడట్లేదు. ఇది ఒక మ్యాచ్ అంతే. జనాలే అతిగా ఆరాట పడుతున్నారు.’’ అని వ్యాఖ్యానించాడు కోహ్లీ. ఇప్పటి వరకూ బహుశా ఎవరు కూడా కోహ్లీ నుంచి ఇలాంటి మాటలు విని ఉండరు. భవిష్యత్ లోనూ ఇలా వ్యాఖ్యానిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభమవుతున్న సమయంలో.. కెప్టెన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మాటలు జట్టు ప్రదర్శనపై ఎఫెక్ట్ చూపొచ్చని అభిప్రాయపడుతన్నారు. నిత్యం దూకుడు స్వభావంతో ఉండే కోహ్లీనేనా ఈ వ్యాఖ్యలు చేసింది? అని అంటున్నారు. అంటే.. ఈ ఫైనల్లో భారత్ ఓటమిపాలయ్యే అవకాశం ఉందని పరోక్షంగా కోహ్లీ చెబుతున్నాడా? అనే డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు.