Virat Kohli in Dubai
Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్లలో దారుణంగా విఫలమైంది. ఈ క్రమంలో ఆటగాళ్లకు బీసీసీఐ సరికొత్త నిబంధనలు విధించింది. కుటుంబాలకు దూరంగా ఉండాలని.. అందరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణం చేయాలని.. వ్యక్తిగత కార్యదర్శులకు అవకాశం లేదని.. చివరికి వ్యక్తిగత వంటగాళ్లకు కూడా చోటు లేదని స్పష్టం చేసింది. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనే నిబంధనను పైకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో బీసీసీఐ(BCCI) తీసుకొచ్చిన నిబంధనల వల్ల టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.. తనకు కావలసిన ఆహారాన్ని సరికొత్త మార్గంలో తెప్పించుకున్నాడు. ఆదివారం ప్రాక్టీస్ కు వచ్చిన కొంత సమయానికే వేదిక వద్దకు ఫుడ్ వచ్చేసింది. ఆ ఫుడ్ కూడా ప్యాకెట్ల రూపంలో ఉంది. బీసీసీఐ తీసుకొచ్చిన నిబంధనల వల్ల ప్రత్యేకంగా చెఫ్ ను నియమించుకునే అవకాశం విరాట్ కోహ్లీకి లేకుండా పోయింది. దీంతో అతడు స్థానికంగా ఉన్న టీం మేనేజర్ కు చెప్పి తనకు కావలసిన ఆహారాన్ని తెప్పించుకున్నాడు. తనకు ఎలాంటి ఫుడ్ అవసరం? దానిని ఎలా వండాలి? ఎలా తయారు చేయాలి? అనే అంశాలను పూర్తిగా వివరించినట్టు తెలుస్తోంది. కోహ్లీ చెప్పిన నేపథ్యంలో ఆ మేనేజర్ దుబాయ్ లో ప్రసిద్ధి చెందిన ఫుడ్ పాయింట్ నుంచి.. ఫుడ్ ప్యాకెట్లను తెచ్చి విరాట్ కోహ్లీకి అందించినట్టు తెలుస్తోంది. ” ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ తినడానికి ఆహార పొట్లాలను అందించారు. ఇతర క్రికెటర్లు తమకిట్లను సర్దుకుంటున్నారు. విరాట్ మాత్రం అక్కడే తన భోజనాన్ని పూర్తి చేశాడు. బస్సులో ప్రయాణిస్తూ తినడానికి మరికొన్ని పొట్లను భద్రపరచుకున్నాడని” జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో..
అయితే మరో రెండు రోజుల్లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుంది. భారత్ తన మొదటి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో ఆడుతుంది. ఆ తర్వాత 23న పాకిస్తాన్ జట్టుతో, మార్చి రెండవ తేదీన న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది. ఇప్పటికే రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా దుబాయ్ చేరుకుంది. అక్కడ ప్రాక్టీస్ చేస్తోంది. మిగతా ఆటగాళ్లు కూడా నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నారు.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు.. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుతో ఇటీవల వన్డే సిరీస్ ను 3-0 తో నెగ్గిన నేపథ్యంలో.. టీమిండియాలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.. అదే ఊపును ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించాలని భావిస్తోంది. గత చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఈసారి అలాంటి తప్పిదాన్ని చేయకుండా టీమిండియా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.