Rohit and Kohli: టీమిండియా క్రికెట్ సంధి దశను ఎదుర్కొంటోంది. ప్రయోగాలు చేసి జట్టులో ఉన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడని గౌతమ్ గంభీర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల కాలంలో టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియా వరుస ఓటములు ఎదుర్కొంటోంది. ఏడాది వ్యవధిలోనే రెండు వైట్ వాష్ లకు గురైంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ స్థానం నుంచి కోచ్ గౌతమ్ గంభీర్ ను తప్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
గౌతమ్ గంభీర్ నిర్వాకం వల్ల టెస్ట్ ఫార్మేట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకున్నారు. అంతకు ముందు టి20 ఫార్మేట్ నుంచి వారిద్దరు శాశ్వతంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరూ ఆడతారా? అనే ప్రశ్న వ్యక్తం అయింది. మెజారిటీ అభిమానులు మాత్రం వీరిద్దరూ ఆ ఫార్మేట్లో ఆడాలని బలంగా కోరుకుంటున్నారు. నిన్నటి వరకు వారిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడలేరని ప్రచారం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన అడ్డంకి తొలగిపోయింది.
టెస్ట్ ఫార్మేట్లో న్యూజిలాండ్ జట్టుతో ఎదురు అయిన వైట్ వాష్.. ఆస్ట్రేలియా జట్టుతో ఎదురు అయిన ఓటమి రోహిత్, విరాట్ కోహ్లీ తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ రెండు సిరీస్లలో వీరిద్దరూ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించలేదు. ఇంగ్లాండ్ జట్టు పర్యటనలో తాము ఏమిటో నిరూపించుకోవాలని వీరిద్దరూ అనుకున్నారు. కానీ మేనేజ్మెంట్ లో ఏం జరిగిందో తెలియదు గానీ వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటించారు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియా వెళ్లే ముందు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ తప్పుకున్నాడు. మేనేజ్మెంట్ గిల్ కు పగ్గాలు అప్పగించింది. దీని వెనక గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కార్ ఉన్నాడనే చర్చ జరిగింది. జట్టును తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి వారిద్దరు రోహిత్ శర్మకు పొమ్మనలేక పొగ పెట్టారని ప్రచారం జరిగింది.
గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత టీమిండియా మూడు టెస్టు సిరీస్ లు కోల్పోయింది. ఇందులో రెండు వైట్ వాష్ లు ఉన్నాయి. రెండు వన్డే సిరీస్ లు కూడా కోల్పోయింది. అయితే వీరిపై వేటువేయాలని మేనేజ్మెంట్ భావించడం లేదు. మరి కొద్ది నెలల్లో టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఆ తర్వాత వారి పదవి కాలం ముగుస్తుంది. దీంతో వారు తప్పుకుంటారని మేనేజ్మెంట్ భావిస్తోంది. టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కార్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. వారిపై సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలోనే రోహిత్, విరాట్ స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకోవచ్చని అభిమానులు చెబుతున్నారు. వారిపై ఎటువంటి విమర్శలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చీఫ్ సెలెక్టర్ నుంచి, కోచ్ నుంచి రోహిత్, విరాట్ లకు ఇబ్బంది తొలగిపోయినట్టే. వారి ప్రదర్శన పై లోతైన శోధన ఉండదు. ఇద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయవచ్చు. వీరిద్దరికి విపరీతమైన అభిమానుల బలం ఉంది. రోహిత్ వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు. విరాట్ కోహ్లీకి 37 సంవత్సరాలు వచ్చేసాయి. వీరిద్దరు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. మహా అయితే మూడు నెలల పాటు వాళ్లు క్రికెట్ ఆడగలుగుతారు. ఐపీఎల్ లో 60 రోజులపాటు బిజీ బిజీగా ఉంటారు. ఇక అంతర్జాతీయ వన్డే క్రికెట్లో కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడతారు. అలాంటప్పుడు తమ శరీర సామర్థ్యాన్ని కాపాడుకుంటూ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తా చూపించాలంటే అంత ఈజీ కాదు. ఒకవేళ స్థిరమైన ప్రదర్శన చేయకపోతే అభిమానుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. కాబట్టి వారు తమ ఫిట్నెస్ కాపాడుకోవాలి. అప్పుడే 2027 వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరూ ఆడేందుకు అవకాశం ఉంటుంది.