Virat Kohli Record: టీమిండియాలో విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతడు పరుగుల వరద పారించాడు. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించాడు. ఆటగాడిగా, నాయకుడిగా దూకుడును కొనసాగించి ప్రస్తుత ఆధునిక క్రికెట్లో అనితర సాధ్యమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు వన్డేలకు మాత్రమే పరిమితమైన విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతని ముందు ఒక వరల్డ్ రికార్డు ఉంది. అది గనుక అతడు సాధించగలిగితే.. సమకాలీన క్రికెట్లోనే కాదు.. క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన ఆటగాడిగా నిలుస్తాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడుతున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత అతడు టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తో అక్టోబర్ 19 న జరిగే పెర్త్ వన్డేలో అతడు గనుక సెంచరీ చేస్తే సరికొత్త రికార్డు పాదాక్రాంతమవుతుంది. ఎందుకంటే 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సింగల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ 3 వన్డేలలో విరాట్ ఒక్క సెంచరీ చేసినా సచిన్ రికార్డును బద్దలు కొడతాడు. టెస్టులలో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ వన్డేలలో 51 శతకాలు సాధించాడు. అతడి గనుక మరొక సెంచరీ చేస్తే ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు.
ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ప్లేయర్లలో సచిన్, రోహిత్, విరాట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుత వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ తన మునుపటి ఆట తీరుని ప్రదర్శిస్తే టీమిండియా కు తిరుగుండదు. అంతేకాదు సరికొత్త రికార్డులు విరాట్ కోహ్లీ సొంతమవుతాయి. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ వన్డేలు ఆడుతున్నాడు. అతడి ఆట మీద అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలను అతడు అందుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా అతడు మైదానంలో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా మైదానాలపై కూడా విరాట్ కోహ్లీకి గట్టిపట్టు ఉంది. ఈ మైదానాలపై విరాట్ కోహ్లీ సెంచరీల మోత మోగించాడు. ఈసారి కూడా అతడు అదే దూకుడు కొనసాగిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. పెర్త్ మైదానంలో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తుండగా అతడిని చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ అభిమానులందరికీ ఎంతో ఓపికగా తన ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు. అంతేకాదు వారితో ఫోటోలు కూడా దిగాడు.