Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli: నాలుగు రోజులకోసారి రంగు వేసుకుంటున్నాను.. విరాట్ భయ్యా.. ఈ మాటలు తగలాల్సిన వాళ్ల...

Virat Kohli: నాలుగు రోజులకోసారి రంగు వేసుకుంటున్నాను.. విరాట్ భయ్యా.. ఈ మాటలు తగలాల్సిన వాళ్ల కు తగిలాయి అంతే!

Virat Kohli: టీమిండియాకు టెస్టులలో దూకుడు నేర్పించిన వాడు విరాట్ కోహ్లీ. వన్డేలలో వీరోచిత పోరాటం ఎలా ఉంటుందో చూపించినవాడు విరాట్ కోహ్లీ. ఇక టి20లో అయితే పాకిస్తాన్ లాంటి జట్లపై ఎటాక్ ఆట ఎలా ఉండాలో వివరించినవాడు విరాట్ కోహ్లీ. విరాట్ అంటే దూకుడు. విరాట్ అంటే తెగువ. విరాట్ అంటే ధైర్యం. అందువల్లే అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓడిపోయే స్టేజిలో కూడా తెగువను తగ్గించడు. తగ్గించుకోవాలని అనుకోడు. విజయమో, వీర స్వర్గమో అనుకునే వ్యక్తి విరాట్. అందువల్లే అతడిని విపరీతంగా ఆరాధిస్తారు. విపరీతంగా ప్రేమిస్తారు. అతడు ఏం చేసినా హై వోల్టేజ్ లెవెల్ లోనే ఉంటుంది.. ఏ మాత్రం తగ్గదు. తగ్గే అవకాశం కూడా లేదు.

Also Read: ఐసీసీ టెస్ట్ ర్యాంకులు.. టీమిండియా సారధి ఏ స్థానంలో ఉన్నాడంటే?

సుదీర్ఘ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. అతని కంటే ముందుగానే రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. వీరిద్దరి కంటే ముందుగానే రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి బయటికి వచ్చేసాడు. మొత్తంగా చూస్తే ఈ లెజెండరీ ప్లేయర్లు లేకుండానే టీమిండియా ఇంగ్లాండ్ లో అడుగు పెట్టింది. తొలి టెస్ట్ ఓడిపోయింది. రెండవ టెస్ట్ గెలిచింది. మూడవ టెస్ట్ నేటి నుంచి మొదలుకానుంది. దీనికంటే ముందుగానే యువరాజ్ సింగ్ క్యాన్సర్ రోగుల కోసం చేపట్టిన చారిటీ కార్యక్రమానికి విరాట్ కోహ్లీ, గేల్, రవి శాస్త్రి, ఇంకా చాలామంది క్రికెటర్లు హాజరయ్యారు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ మీడియా ముందు కనిపించడం దాదాపు ఇదే తొలిసారి. యువరాజ్ నిర్వహించిన ఆ కార్యక్రమంలో విరాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతేకాదు తోటి ఆటగాళ్లతో.. సీనియర్ ప్లేయర్లతో అతడు సరదాగా సంభాషించాడు.

ఈ కార్యక్రమానికి గౌరవ్ కపూర్ హోస్ట్ గా వ్యవహరించాడు. వచ్చిన వ్యక్తులను మొత్తం మాట్లాడమని కోరాడు. విరాట్ వంతు రాగానే అతడిని వేదిక మీద ఆహ్వానించాడు గౌరవ్ కపూర్. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి ఎందుకు తప్పుకున్నావ్ అంటూ గౌరవ్ కపూర్ అడిగాడు. దానికి విరాట్ నవ్వుతూ బదులు చెప్పాడు..”నా గడ్డం తెల్లబడింది.. నాలుగు రోజులకు ఒకసారి రంగు వేసుకుంటున్నాను. రంగు వేసుకుంటున్నాను అంటేనే నేను తప్పు కావాల్సిన అవసరం వచ్చిందని సంకేతం.. గడ్డానికి రంగు వేసుకుంటున్నప్పటికీ.. ఇంకా క్రికెట్ ఆడ మంటావా” అంటూ విరాట్ వ్యాఖ్యానించాడు.. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వారు.. ఆ తర్వాత విరాట్ తన క్రికెట్ జీవితాన్ని సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రవి శాస్త్రి తన టెస్ట్ క్రికెట్ కెరియర్ మొత్తాన్ని తీర్చే దిద్దాడని విరాట్ పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్లో తాను ఏదైనా సాధించానంటే దానికి రవి శాస్త్రి కారణమని విరాట్ పేర్కొన్నాడు. ” టెస్ట్ క్రికెట్లో నేను చాలా ఘనతలు సొంతం చేసుకున్నాను. అదంతా రవి శాస్త్రి వల్లే. మా ఇద్దరి మధ్య స్పష్టమైన అనుబంధం ఉంది. అది ఎలా ఉంటుందనేది మా ఇద్దరికీ మాత్రమే తెలుసు. ఒక ఆటగాడు కెరియర్లో పైకి ఎదగాలంటే ఇలాంటి సపోర్టు ఉండాల్సిందే. అలాంటి సపోర్ట్ లేకుండా ఎదగడం కష్టం. నేను వైఫల్యం చెందిన ప్రతి సందర్భంలో నాకు రవి శాస్త్రి అండగా నిలిచారు. అంతేకాదు నాకోసం విలేకరుల సమావేశంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. నా ప్రయాణంలో ఆయన అత్యంత కీలకమైన వ్యక్తి. ఆయన మీద నాకు వికరితమైన గౌరవం ఉంటుందని” కోహ్లీ వ్యాఖ్యానించాడు.

“కెరియర్ మొదట్లో యువి, హర్భజన్, జహీర్ లాంటి లెజెండరీ ప్లేయర్లతో నాకు మంచి రిలేషన్ ఉండేది.. నార్త్ జోన్ టోర్నీ కోసం నేను బెంగళూరు వెళ్ళాను. అప్పుడు యువి భయ్యాను కలిశాను. నాటి రోజుల్లో నాకు వారు అండగా నిలిచారు. ఒక ప్లేయర్ గా సహాయపడ్డారు. మైదానం బయట కూడా వాళ్ళు నాతో చాలా సరదాగా ఉండేవారు. వారితో ఉన్న బంధం నాకు ప్రత్యేకమైనదని” పేర్కొన్నాడు.. ” యువి క్యాన్సర్ బారినపడి దానిని చేయించాడు. చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్పటికే వన్డే ప్రపంచ కప్ తుది పోరులో అతడు ఆడిన ఇన్నింగ్స్ కళ్ళ ముందు కనిపిస్తోంది.. ఎడ్జ్ బాస్టన్ లో గిల్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఇప్పుడు కొత్తగా కనిపిస్తోందని” విరాట్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ చేసిన గడ్డం వ్యాఖ్యలు తాకే వాళ్లకు తాకాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.. ఎందుకంటే సుదీర్ఘ ఫార్మాట్ కు సారథ్యం వహించాలని విరాట్ భావించాడు. దీనిని కోచ్ గంభీర్, మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. దీంతో విరాట్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఈ తెల్ల గడ్డం వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version