అందరూ ఫార్మాట్ కు తగ్గట్టుగా ఆడుతుంటారు. కానీ.. కొందరు మాత్రం ఫార్మాట్ ఏదైనా తమదైన జోరు కొనసాగిస్తుంటారు. అలాంటి క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు వరసలో ఉంటాడు. తనదైన దూకుడుతో ఐపీఎల్ లో నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్న కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు.ఇప్పటి వరకూ 196 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 6000 పరుగులు సాధించాడు. ఈ మార్క్ చేరుకున్న మొదటి బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలిచాడు. ఇప్పట్లో ఈ రికార్డును ఎవరూ చేరుకునే పరిస్థితుల్లేవు. ఎందుకంటే.. అతని వెనకున్నవారు చాలా దూరంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న సురేష్ రైనా.. 5,448 పరుగులతో కొనసాగుతున్నాడు. 5,428 పరుగులతో శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉండగా.. 5,384 పరుగులతో డేవిడ్ వార్నర్ నాలుగో ప్లేసులో ఉన్నాడు.
ఛేజింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అతని ఆట తీరును పరిశీలించిన వారు.. ఒత్తిడిలో కోహ్లీ ఆట మరింతగా రాటుదేలుతుందని చెబుతుంటారు. సవాల్ ను స్వీకరించే వ్యక్తిత్వమే ఈ ప్రదర్శనకు కారణమని కూడా అంటారు. ఇప్పటి వరకూ ఐపీఎల్ లో 5 సెంచరీలు సాధించాడు కోహ్లీ. 6 సెంచరీలతో గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇక బౌండరీలు సాధించడంలోనూ కోహ్లీ టాప్ త్రీలో ఉన్నాడు. ఐపీఎల్ 500 బౌండరీలు సాధించిన వారిలో ధావన్, వార్నర్ తర్వాత కోహ్లీ ఉన్నాడు. 200 సిక్సర్లు కూడా సాధించిన కోహ్లీ.. గేల్, డివిలియర్స్, రోహిత్ శర్మ, పొలార్డ్ తర్వాత స్థానంలో ఉన్నాడు.
ఇంతగా రెచ్చిపోయే కోహ్లీ.. ఐపీఎల్ అరంగేట్ర సీజన్ పేలవంగా సాగిపోవడం గమనార్హం. ఆ సీజన్ మొత్తంలో అతను చేసింది కేవలం 165 పరుగులు మాత్రమే! సగటు అత్యల్పంగా 15. కానీ.. రెండో సీజన్ నుంచి తనేంటో చూపించాడు. విధ్వంసకర బ్యాటింగ్ కు కళాత్మకతను జోడించి పరుగుల వరద పారించాడు. ఇప్పటికీ.. అదే కంటిన్యూ చేస్తున్నాడు.
అరంగేట్రం నుంచి బెంగళూరు టీమ్ లోనే కోహ్లీ.. 2013లో కెప్టెన్ అయ్యాడు. అయితే.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయాడు. ఈ డ్రీమ్ ను ఈ సారైనా సాధించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.