AB de Villiers comments Virat Kohli : సాధారణంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్లేయర్ల మధ్య బేధాభిప్రాయాలు ఉంటాయి. విభేదాలు కూడా ఉంటాయి. అయితే అవి మైదానం వరకే పరిమితమవుతుంటాయి. ఆ తర్వాత దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ ఆటగాళ్లు కలిసిపోతుంటారు. సరదాగా వ్యాఖ్యలు చేసుకుంటుంటారు. ఆట పట్టించుకుంటూ ఉంటారు. అయితే అందరి ఆటగాళ్ల మధ్య ఇలాంటి పరిస్థితి ఉండదు. కొంతమంది ఆటగాళ్లు విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటారు. పగను ప్రదర్శిస్తుంటారు. కోపాన్ని వ్యక్తం చేస్తుంటారు. గెట్టు పంచాయితీ ఉన్నట్టు… దీర్ఘకాలం విరోధం ఉన్నట్టు.. వ్యవహరిస్తుంటారు. కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటి జాబితాలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ ఉంటాడు. మరి అతడు కోపం పెంచుకుంది ఎవరి మీద? కసి పెంచుకుంది ఎవరి మీద? ఎన్ని రోజులుగా కనీసం మాట కూడా మాట్లాడనిది ఎవరితో?
విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ ప్రారంభించి ఇప్పటివరకు బెంగళూరు జట్టుకే ఆడుతున్నాడు. బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా, సారధిగా భిన్నమైన పాత్రలను పోషించాడు. ఇక ఇటీవల ట్రోఫీ సాధించిన సందర్భంగా బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీకి డివిలియర్స్ తో విభేదాలు చవిచూశాయి. దీనికి దారి తీసిన కారణాన్ని కూడా డివిలియర్స్ వెల్లడించాడు..” 2024 లో ఇంగ్లీష్ జట్టుతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ నాతో మాట్లాడటం మానేశాడు. ఆ సమయంలో అనుష్క గర్భంతో ఉందని.. రెండవ బిడ్డకు జన్మను ఇవ్వబోతుందని నేను మీడియాతో చెప్పాను. అది కూడా బహిరంగంగా కాదు. విరాట్ కోహ్లీ మీద చర్చ వచ్చినప్పుడు.. యధాలాపంగా నా నోటి నుంచి ఆ మాట బయటికి వచ్చింది. దానిని మీడియా విపరీతంగా హైలెట్ చేసింది. అలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. దీంతో విరాట్ కోహ్లీ నాతో మాట్లాడటం మానేశాడు. కొంతకాలంగా అదే ధోరణి కొనసాగించాడని”ఏబి పేర్కొన్నాడు. ఇంకా ఇటీవల కాలం నుంచి అతడు తనతో మాట్లాడుతున్నట్టు ఏబీ వెల్లడించాడు. ఇక ఇటీవల కన్నడ జట్టు ఐపిఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత వీరిద్దరూ కలిసి మైదానంలో సంబరాలు జరుపుకున్నారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని అభినందనలు తెలుపుకున్నారు.
ట్రోఫీ స్వీకరించిన తర్వాత డివిలియర్స్ ను కోహ్లీ ఆ లింగనం చేసుకున్నాడు. చివరికి జట్టు ట్రోఫీ సాధించిందని డివిలియర్స్ తో కోహ్లీ పేర్కొన్నాడు. అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాలో కూడా డివిలియర్స్ తో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మాటలు రావడంలేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. అయితే కోహ్లీ మాదిరిగానే ఏబి కూడా స్పందించాడు. ఇది ఉద్వేగ భరితమైన సమయమని పేర్కొన్నాడు.