Vaibhav Suryavanshi: ఒక వయసుకు వచ్చిన తర్వాత.. టీమిండియాలో చేరిన తర్వాత వైభవ్ సూర్య వంశీ ఎలా ఆడతాడో తెలియదు గానీ.. ఇలాంటి రికార్డులు సృష్టిస్తాడో తెలియదు గాని.. ఇప్పటికైతే ప్రపంచ రికార్డులను పాదాక్రాంతం చేసుకుంటున్నాడు. దూకుడుకు పర్యాయపదంగా.. వేగానికి అసలు సిసలైన కొలమానంగా ఆడుతున్న అతడు.. ఇప్పుడు అంతకుమించి అనే స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. మైదానంతో సంబంధం లేకుండా.. ప్రత్యర్థి ఎవరు అనే విషయాన్ని పట్టించుకోకుండా.. బంతులు వేసే బౌలర్లను ఏమాత్రం లెక్క చేయకుండా తుఫాన్ వేగంతో బ్యాటింగ్ చేస్తున్నాడు.. తద్వారా పరుగుల వరద అనేది ఎలా ఉంటుందో ప్రత్యర్థి ఆటగాళ్లకు కళ్ళ ముందు కనిపించేలా చేస్తున్నాడు.
ఐపీఎల్ లో ఏకంగా సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ.. తనది గాలివాటం బ్యాటింగ్ కాదని..తాను పక్కా ప్రొఫెషనల్ అని నిరూపించుకుంటున్నాడు వైభవ్. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. తిరుగులేని స్థాయిలో పరుగులు సాధిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. తాజాగా ఈ బీహార్ ఆటగాడు మరో రికార్డు అందుకున్నాడు. మెన్స్ ఏషియా కప్ రైసింగ్ స్టార్స్ టోర్నీలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చూస్తుండగానే మెరుపు వేగంతో సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. వచ్చిన దగ్గర నుంచి మొదలుపెడితే ఔట్ అయి వెళ్లే వరకు వైభవ్ ఒకే వేగంతో బ్యాటింగ్ చేశాడు. బంతిమీద కనికరం లేకుండా బీభత్సంగా పరుగులు సాధించాడు.
మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈ – A జట్టుపై అదరగొట్టాడు. తన బ్యాటింగ్ ద్వారా ఊచ కోత కోశాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వైభవ్ సూర్యవంశీ ఖాతాలో తొమ్మిది సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. కేవలం బౌండరీల ద్వారానే అతడు 94 పరుగులు సాధించడం విశేషం. ఫలితంగా 10 ఓవర్లలోనే ఇండియా -A జట్టు ఒక వికెట్ నష్టానికి 149 పరుగులు చేసింది. ఐపీఎల్ లో భీకరమైన బ్యాటింగ్ చేసిన తర్వాత వైభవ్.. తన ఆట తీరును మరింత మెరుగుపరుచుకున్నాడు. అటాకింగ్ ఆట తీరుతో అదరగొడుతున్నాడు. నిండా 14 సంవత్సరాలు లేని వైభవ్ మైదానంలో సృష్టిస్తున్న రికార్డులు ఇప్పటికే సంచలనంగా మారాయి. వచ్చే రోజుల్లో అతడు ఏ స్థాయిలో ఘనతలు అందుకుంటాడో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
VAIBHAV SURYAVANSHI HAMMERED 144 (42) FOR INDIA A. pic.twitter.com/Ou2islDX4m
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2025