Vaibhav Suryavanshi Vice Captain: అతని వయసు 14 సంవత్సరాలు. ఇంకా మీసకట్టు కూడా ఏర్పడలేదు. అలాంటి బాలుడు మైదానంలోకి అడుగుపెట్టాడు. భయం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తాను ఒక బాలుడుననే సంగతి కూడా విస్మరించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ కొట్టాడు. ఆ మ్యాచ్లో దూకుడు కొనసాగించాడు. కానీ ఆ తదుపరి మ్యాచ్లోనే శివతాండవం చేశాడు. పెద్ద పెద్ద బౌలర్లను సైతం ఏడిపించాడు. పరుగుల వరద పారించి, తాను ఏమిటో నిరూపించుకున్నాడు. తద్వారా ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అనే సంకేతాలు ఇచ్చాడు. అతడే వైభవ్ సూర్యవంశీ.
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సూర్యవంశీ అదరగొట్టాడు. దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు విఫలమైనప్పటికీ అతడు మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. రాహుల్ ద్రావిడ దృష్టిలో పడ్డాడు. తన ఆట తీరును మెరుగుపరుచుకున్నాడు. సెలక్టర్లు కూడా అతని చూసి ఫిదా అయిపోయారు. అందువలన అండర్ 19 క్రికెట్ జట్టుకు ఎంపిక చేశారు. అండర్ 19 లో అతను అత్యంత వేగవంతమైన సెంచరీని టీమిండియా తరఫున చేశాడు.
సూర్యవంశీ బీభత్సంగా ఆడుతున్న నేపథ్యంలో అతడికి ఊహించని బహుమతి లభించింది. 14 సంవత్సరాల వయసులోనే అతడు విధ్వంసకరమైన బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మెప్పిస్తున్న నేపథ్యంలో.. బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజి ట్రోఫీకి సంబంధించి 2025 -26 సీజన్లో తొలి రెండు రౌండ్లకు ఉప సారధిగా నియమించింది. ఆ జట్టుకు నాయకుడిగా సకిబుల్ గని వ్యవహరిస్తున్నాడు. బుధవారం నుంచి ఈ ట్రోఫీ మొదలవుతుంది. ఇటీవల అండర్ 19 జుట్టు తరఫున ఆస్ట్రేలియాపై తాండవం చేశాడు సూర్యవంశీ. ఇప్పుడు రంజీ ట్రోఫీలో కూడా అతడు అదే జోరు కొనసాగిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూర్యవంశీ అండర్ 19 లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డ మీద పరుగుల వరద పారించాడు.
ఐపీఎల్ లో అదరగొట్టిన నేపథ్యంలో సూర్యవంశీ ఒక్కసారిగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కలిసే అవకాశం అతనికి లభించింది. అతని ఆటతీరును ప్రధానమంత్రి స్వయంగా మెచ్చుకున్నారు. ఇలానే దూసుకుపోవాలని కోరారు. మరోవైపు సూర్యవంశీ కోసం అతడి తండ్రి గతంలో తన ఇంటిని క్రికెట్ మైదానంగా మార్చాడు. అతడు సాధన చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. కొడుకు కోసం తన కెరియర్ ను సైతం త్యాగం చేశాడు. కొడుకు ఆడుతున్న టోర్నీలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ధైర్యంగా కొడుకును ప్రోత్సహించేవాడు.