
చాలా మంది అదృష్టాన్ని నమ్ముతుంటారు. వీళ్లంతా అనివార్యంగా దురదృష్టాన్ని కూడా విశ్వసిస్తారు. క్రికెట్ మ్యాచ్ గెలవాలంటూ పూజలు, హోమాలు చేసేవారికి.. స్టేడియంలో, టీవీ దగ్గర కూర్చొని దేవుళ్లను ప్రార్థించే వాళ్లుకు కొదవే లేదు. ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఇండియా ఓడిపోవడంతో.. ఇలాంటి ఓ నమ్మకం తెరపైకి వచ్చింది. ఓ కారణం వల్లనే టీమిండియా ఓడిపోయిందని చర్చించుకుంటున్నారు.
144 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి నిర్వహించిన..‘టెస్ట్ ఛాంపియన్ షిప్’ టైటిల్ ను ఛేజిక్కించుకునే సువర్ణావకాశాన్ని కోల్పోయింది టీమిండియా. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైన టీమిండియా.. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓడిపోయినప్పుడు కారణాలు చర్చించుకోవడం సహజమే. చాలా మంది ఆటతీరును విశ్లేషిస్తే.. మరికొందరు నమ్మకాలను విశ్లేషిస్తారు. ఈ కోణంలో చూసినప్పుడు.. ఈ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి కారణం.. తెలుగు ప్లేయర్ ను పక్కన పెట్టడమేనట!
అవును.. ఐసీసీ టోర్నీకి వెళ్లే భారత జట్టులో చోటు దక్కాల్సిన తెలుగు ప్లేయర్లను పక్కన పెట్టిన ప్రతిసారీ.. భారత జట్టు ఓడిపోయిందని అంటున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్. అంతేకాదు.. ఇందుకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. 2003 వన్డే ప్రపంచ కప్ కు వీవీఎస్ లక్ష్మణ్ ను పక్కనపెట్టి.. దినేశ్ మోంగియాను జట్టులోకి తీసుకున్నారు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది భారత్.
ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్ లో అంబటి రాయుడిని కూడా పక్కన పెట్టారు. ‘త్రీడీ’ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ టోర్నీలో సెమీస్ లో ఇదే న్యూజీలాండ్ చేతిలో ఓడిపోయింది భారత్. రాయుడిని పక్కన పెట్టడం.. అతను రిటైర్మెంట్ ప్రకటించడం.. భారత క్రికెట్లో పెద్ద చర్చ జరగడం తెలిసిందే.
ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో హనుమ విహారిని తీసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ.. మరోసారి త్రిబుల్ డైమెన్షన్ (త్రీడీ) ప్లేయర్ అంటూ రవీంద్ర జడేజాను తీసుకున్నారు. కానీ.. ఈ మ్యాచ్ లో జడేజా పేలవ ప్రదర్శన చేశాడు. ప్రతిష్టాత్మకమైన టెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడిపోయింది. దీంతో.. తెలుగు వాళ్లను పక్కన పెట్టిన ప్రతిసారీ ఐసీసీ ఈవెంట్లో భారత్ ఓడిందని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్.