KKR vs SRH: ఆరు సంవత్సరాల తర్వాత ఐపిఎల్ లో అదిరిపోయే రేంజ్ లో హైదరాబాద్ జట్టు ఆడుతోంది. లీగ్ దశ నుంచి ప్లే ఆఫ్ వరకు దూకుడయిన ఆట తీరు ప్రదర్శించి ఫైనల్ వెళ్ళింది. కానీ ఫైనల్ లో ఆ జట్టు ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. లీగ్, ప్లే ఆఫ్ లో కోల్ కతా చేతిలో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్లో ప్రతీకారానికి బదులు చేతులెత్తేసే స్థితికి దిగజారింది..
టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ మరో మాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బహుశా అంతకు ముందు రోజు వర్షం కురవడంతో.. పిచ్ మందకొడిగా మారిందని అతడు భావించి ఉండవచ్చు. అందుకే అతడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పైగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ భీకరమైన ఫామ్ లో ఉండడం కూడా కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడానికి ఒక కారణం అయి ఉండవచ్చు. అయితే కమిన్స్ తీసుకున్న నిర్ణయం తప్పని కోల్ కతా బౌలర్లు నిరూపించారు.
తొలి ఓవర్ వేసిన స్టార్క్.. అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్ వేసిన ఐదవ బంతి అనూహ్యంగా టర్న్ అయింది. వెంటనే వికెట్లను గిరాటేసింది. దీంతో అభిషేక్ శర్మ రెండు పరుగులకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్ జట్టు రెండు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్ వైభవ్ అరోరా వేశాడు. అతడు వేసిన నాలుగు బంతులను రాహుల్ త్రిపాఠి సరిగానే కాచుకున్నాడు. సరిగ్గా ఐదవ బంతికి స్ట్రైకింగ్ కు వచ్చిన హెడ్.. కీపర్ కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. దీంతో ఆరు పరుగులకే హైదరాబాద్ జట్టు ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది..
బ్యాటింగ్ కు సహకరిస్తుందనుకున్న చెన్నై మైదానం క్రమంగా బౌలింగ్ వైపు మొగ్గుతోంది. నల్ల మట్టి పోయడంతో మైదానం అనూహ్యంగా బంతి టర్న్ అయ్యేందుకు కారణమవుతున్నది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. మైదానం మందకొడిగా మారడం కూడా ఇందుకు ఒక కారణం.. ఆరు పరుగులకే కీలకమైన రెండు వికెట్లు కోల్పోవడంతో..కోల్ కతా బౌలర్లు మ్యాచ్ పై పట్టు బిగించారు.