Gongadi Trisha: అండర్ – 19 వుమెన్స్ వరల్డ్ కప్ లో త్రిష తిరుగులేని ఆట తీరు ప్రదర్శించింది. టీమిండియా అండర్ -19 వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించింది. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 44 రన్స్ చేయడంతో పాటు.. కీలకమైన మూడు వికెట్లు కూడా పడగొట్టింది.. ఆమె చూపించిన అద్వితీయమైన ప్రదర్శనకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారాలు త్రిష సొంతమయ్యాయి.. కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే కాదు.. ఈ టోర్నీ ప్రారంభం నుంచే త్రిష అదరగొట్టింది.. అండర్ 19 వరల్డ్ కప్ కంటే ముందు త్రిష ఆసియా కప్ లో ఆడింది. 53 సగటును కొనసాగిస్తూ.. 159 పరుగులు చేసింది. అంతేకాదు ఈ టోర్నీలో ఆమె చేసిన 159 పరుగులు హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం.
309 పరుగులు..
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ లోను త్రిష అదరగొట్టింది. ఏడు మ్యాచ్లలో ఏకంగా 309 పరుగులు చేసింది. ఆమె చేసిన ఈ పరుగులు టీమిండియా విజయాలకు ఎంతగానో ఉపకరించాయి. ఆమె చేసిన 309 పరుగులలో ఒక సెంచరీ కూడా ఉంది. ఆమె యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144 ఉండడం విశేషం. బౌలింగ్ లోనూ త్రిష ఏడు వికెట్లు పడగొట్టింది. ఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లు తీసింది. అండర్ 19 వరల్డ్ కప్ లో త్రిష ఓపెనర్ గా వచ్చింది. 4, 27, 49, 40, 110, 44* పరుగులు చేసింది. ఈ పరుగులతో అండర్ 19 వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన త్రిషకు చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. ఆమె తండ్రి రామిరెడ్డి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగింది. క్రికెట్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది.. ఏకంగా అండర్ 19 వరల్డ్ కప్ సాధించడంలో టీమ్ ఇండియాలో ముఖ్య భూమిక పోషించింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తన ఆట తీరును అంతకంతకు మెరుగుపరుచుకుంటూ.. సరికొత్త ప్లేయర్ గా ఆవిర్భవించింది. టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత త్రిష పేరు మార్మోగిపోతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు త్రిషకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై రెపరెపలాడించిందని కొనియాడుతున్నారు.. మరోవైపు త్రిష అండర్ 19 వరల్డ్ కప్ లో చేసిన ప్రదర్శనను గుర్తు చేసుకుంటూ.. భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. త్రిషకు అనుకూలంగా నినాదాలు చేశారు. త్రిష ఇదే జోరు కొనసాగించాలని.. టీమ్ ఇండియాకు ఇదే స్థాయిలో ట్రోఫీలు అందించాలని వారు పేర్కొన్నారు. భద్రాచలం వ్యాప్తంగా త్రిష ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ త్రిష పేరు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు త్రిష ఆటతీరును ప్రశంసిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.