Champions Trophy 2025: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో లీగ్ దశ మ్యాచులు ముగిశాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లో విజయాలు సాధించిన భారత్ ఓటమే ఎరుగని జట్టుగా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. టీమిండియాతోపాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా సెమీస్‌కు చేరుకున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ జట్లపై క్లారిటీ..
ప్రపంచకప్‌లో లీగ్ స్టేజీ పూర్తి కావడంతో పాకిస్థాన్ వేదికగా 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఏవో తేలిపోయాయి. వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ స్టేజీ పూర్తి అయ్యే సరికి టాప్ 7లో నిలిచిన జట్లు నేరుగా అర్హత సాధిస్తాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇది వరకే వెల్లడించింది. కాగా.. ఆతిథ్య దేశం హోదాలో పాకిస్థాన్ ఇప్పటికే అర్హత సాధించింది. అయితే.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో పాకిస్థాన్ ఉండడంతో.. పాక్ కాకుండా టాప్ 7 అంటే పట్టికలో 8వ స్థానం వరకు ఉన్న జట్లు ఛాంఫియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయ్యాయి.
అర్హత సాధించిన జట్లు ఇవే..
సెమీస్‌కు చేరిన టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతోపాటు ఆతిథ్య హోదాలో పాకిస్థాన్, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. తొమ్మిదో స్థానంలో నిలిచిన శ్రీలంక, పదో స్థానంలో ఉన్న నెదర్లాండ్స్ అర్హత కోల్పోయాయి. అలాగే వన్డే ప్రపంచ కప్ కు అర్హత సాధించడంలో విఫలమైన వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం లేదు.
ఫార్మాట్‌పై చర్చ..
ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఏవో తేలిపోవడంతో పాకిస్థాన్ వేదికగా జరిగే ఈ ట్రోఫీని ఏ ఫార్మాట్‌లో నిర్వహిస్తారన్న చర్చ మొదలైంది. వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తారా..లేక టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తారా..? అన్నది ఐసీసీ ఇంకా వెల్లడించలేదు. వన్డే ప్రపంచకప్ పూర్తయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.