https://oktelugu.com/

Duleep Trophy 2024 : అనంతపురం.. ఆస్ట్రేలియా పెర్త్.. దులీప్ ట్రోఫీకి మన కరువుసీమ ఎంపిక వెనుక పెద్ద కథ

అందువల్లే బీసీసీఐ అనంతపురం మైదానాన్ని ఎంపిక చేసుకుంది. ఈ మైదానంపై ఆడిన ఆటగాళ్లు ఆస్ట్రేలియాలోనూ రాణిస్తారని బీసీసీఐ భావిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో భారత్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 5, 2024 / 10:33 PM IST

    This is the reason behind the selection of Duleep Trophy in our Anantapur

    Follow us on

    Duleep Trophy 2024 : టీమ్ ఇండియా త్వరలో వరుసగా పది టెస్టులు ఆడనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో తలపడుతుంది. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవాలంటే ఈ మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాల్సిందే. అందు గురించే భారత జట్టు కూర్పు విషయంలో గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. టెస్ట్ క్రికెట్ జట్టులోకి ఎంపిక చేసే ఆటగాళ్ల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. కచ్చితంగా దేశవాళి క్రికెట్ ఆడాలనే నిబంధనను అమలు చేస్తోంది.

    దేశవాళి క్రికెట్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం వేదికగా నిర్వహిస్తోంది. ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన మైదానంలో ఈ టోర్నీ నిర్వహిస్తోంది. ఇక్కడ టోర్నీ నిర్వహించడం పట్ల మొదట్లో చాలామంది ఆశ్చర్యంగా చూశారు. దేశంలో ఎన్ని మైదానాలు ఉండగా బీసీసీఐ అనంతపురాన్ని ఎంచుకోవడం పట్ల నొసలు చిట్లించారు. అయితే బీసీసీఐ అనంతపురాన్ని ఎందుకు ఎంచుకున్నదనేది తర్వాత గాని అర్థం కాలేదు. ఎందుకంటే గురువారం ప్రారంభమైన దులీప్ ట్రోఫీలో ఇండియా ఏ, బీ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడిన బీ జట్టును ఏ జట్టు బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక అప్పుడు మొదలైంది అసలు సిసలైన మజా. మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఇండియా ఏ జట్టు బౌలర్లు నిప్పులు చెరిగే విధంగా బంతులు వేశారు. దీంతో ఇండియా బీ జట్టు ఆటగాళ్లు మైదానంలో ఉండేందుకే భయపడ్డారు. రాకెట్ల లాగా దూసుకొస్తున్న బంతులను డిఫెన్స్ చేయలేక ఇబ్బంది పడ్డారు. ఇండియా బీ జట్టులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (30), అభిమన్యు ఈశ్వర్(13) మాత్రమే కాస్తలో కాస్త నయం అనే తీరుగా ఆడారు.. మిగతా ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్(9), రిషబ్ పంత్ (7), నితీష్ కుమార్ రెడ్డి (0), వాషింగ్టన్ సుందర్(0), సాయి కిషోర్ (1) వచ్చినవాళ్లు వచ్చినట్టే పెవిలియన్ చేరుకున్నారంటే బౌలింగ్ ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు.

    The-pavilion-at-the-Anantapur-Cr

    ఇక్కడ రాణిస్తే చాలు.. ఆస్ట్రేలియాలో దున్నేసినట్టే..

    ఇండియా ఏ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వాస్తవానికి అనంతపురం మైదానం, ఆస్ట్రేలియా లోని పెర్త్ ఒకే విధంగా ఉంటాయి. పైగా బంగ్లాదేశ్ తో టోర్నీ తర్వాత భారత్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. అందువల్లే బీసీసీఐ అనంతపురం మైదానాన్ని ఎంపిక చేసుకుంది. ఈ మైదానంపై ఆడిన ఆటగాళ్లు ఆస్ట్రేలియాలోనూ రాణిస్తారని బీసీసీఐ భావిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో భారత్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ అదే బోర్డర్ – గవాస్కర్ టోర్నీ విషయంలో భారత్ చెమటోడ్చాల్సిందే. పైగా ఐదు టెస్టుల సిరీస్ భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఒకవేళ గత రెండు సీజన్ల మాదిరిగానే భారత్ ఆస్ట్రేలియా పై బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లోకి ఆస్ట్రేలియా కాకుండా మరో జట్టు వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ మైదానాలు కూడా ఆస్ట్రేలియా మాదిరిగానే ఉంటాయి. అందువల్లే బీసీసీఐ మిగతా అన్ని మైదానాలను వదిలిపెట్టి.. అనంతపురాన్ని ఎంచుకుంది.