https://oktelugu.com/

Manu Bhaker : మను భాకర్.. ఈ ఆరడుగుల బుల్లెట్ గురి పెడితే పతకాల పంటే.. ఇప్పటివరకు ఎన్ని ఘనతలు సాధించిందంటే?

2017లో కేరళ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో ఏకంగా తొమ్మిది గోల్డ్ మెడల్స్ సాధించింది. ప్రపంచ మాజీ నెంబర్ వన్, ఒలింపియన్ హీనా సిద్దు ను మట్టి కరిపించింది. పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఫైనల్ లో హీనా నెలకొల్పిన 240.8 పాయింట్ల రికార్డును బద్దలు కొట్టింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 28, 2024 / 10:24 PM IST

    Paris Olympics 2024 - Manu Baker :

    Follow us on

    Manu Bhaker : పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించి సత్తా చాటింది 22 సంవత్సరాల మను భాకర్.. దీంతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోతోంది. వాస్తవానికి స్కేటింగ్, టెన్నిస్, బాక్సింగ్ వంటి క్రీడల పై ఆమెకు మక్కువ ఉన్నప్పటికీ.. షూటింగ్ పైనే ఎక్కువగా దృష్టి సారించింది.. అయితే షూటింగ్ విషయంలో తన గురి తప్పలేదని కాంస్య పతకం సాధించడం ద్వారా నిరూపించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో మెడల్ సాధించిన తొలి భారత మహిళగా మను సరికొత్త రికార్డు సృష్టించింది. మను పుట్టింది హర్యానాలో. హర్యానా పేరు చెప్తే బాక్సర్లు, రెజ్లర్లు స్ఫురణ లోకి వస్తారు.. అయితే మను వాటి జోలికి వెళ్లకుండా షూటింగ్ క్రీడను ఎంచుకుంది. అందులో అద్భుతమైన ప్రతిభ చూపి.. అనితర సాధ్యమైన విజయాలు సాధించింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి.. మరోసారి తన సత్తా చాటింది.

    మను ఫిబ్రవరి 18, 2002లో హర్యానాలో జన్మించింది. ఆమె తండ్రి పేరు రామ్ కిషన్ భాకర్. కమర్షియల్ షిప్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. మను పాఠశాలలో చదువుతున్నప్పుడు టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ లో సత్తా చాటేది. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం సంపాదించింది. ఆయా విభాగాలలో మెడల్స్ సాధించి ఔరా అనిపించింది. అది తనకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు ఉన్నట్టుండి షూటింగ్ వైపు మళ్ళింది. 2016లో రియో ఒలింపిక్స్ అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పి షూటింగ్ పిస్టల్ కొనిపించుకుంది. ఈ దశలో 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీలలో రజత పతకం సాధించి ఔరా అనిపించింది. అంతర్జాతీయ పోటీలలో తొలిసారి మెడల్ దక్కించుకుంది.

    2017లో కేరళ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో ఏకంగా తొమ్మిది గోల్డ్ మెడల్స్ సాధించింది. ప్రపంచ మాజీ నెంబర్ వన్, ఒలింపియన్ హీనా సిద్దు ను మట్టి కరిపించింది. పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఫైనల్ లో హీనా నెలకొల్పిన 240.8 పాయింట్ల రికార్డును బద్దలు కొట్టింది. 242.3 పాయింట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక 2018 మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ కప్ లో ఎంట్రీ ఇచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఫైనల్ లోకి వెళ్లేందుకు ఉద్దేశించిన ఎంట్రీ రౌండ్లో ప్రపంచ జూనియర్ రికార్డును బ్రేక్ చేసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో అన్నా కొరకాకి, మూడుసార్లు ప్రపంచ కప్ గెలిచిన సెలెన్, అలెజాండ్రా జవాలా ను ఓడించి 237.5 పాయింట్లతో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. 16 సంవత్సరాల వయసులోనే ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ లో గోల్డ్ మెడల్ దక్కించుకొని.. అతి చిన్న వయసున్న షూటర్ గా రికార్డు సృష్టించింది. ఇక పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిక్స్ డ్ టీం విభాగంలో తోటి షూటర్ ఓం ప్రకాష్ తో కలిసి రెండవ స్వర్ణం అందుకుంది. 2018 ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ లో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణాన్ని సాధించింది. మిక్స్ డ్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఔరా అనిపించింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మాత్రం వెంట్రుకవాసిలో మెడల్ కోల్పోయింది. 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో మను కు మెడల్ రాకపోయినప్పటికీ.. 2018 లో అర్జెంటీనా దేశంలోని బ్యునస్ ఎయిర్స్ లో జరిగిన యూత్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. యూత్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత షూటర్ గా, భారత్ నుంచి మొదటి మహిళ అథ్లెట్ గా మను నిలిచింది.

    షూటింగ్లో సత్తా చాటే మను వయసు ప్రస్తుతం 22 సంవత్సరాలు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఆమె నిద్ర లేస్తుంది. 7 గంటల వరకు యోగా చేస్తుంది. 8 గంటలకు అల్పాహారం స్వీకరిస్తుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు షూటింగ్లో ట్రైనింగ్ తీసుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఫిజియోథెరపిస్టుతో శరీరాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు తనకు ఇష్టమైన పెయింటింగ్ వేస్తుంది. సాయంత్రం 6:00 నుంచి 8:30 వరకు జిమ్ లో కసరత్తులు చేస్తుంది. రాత్రి 9 గంటలకు భోజనం చేస్తుంది. తన శరీర అవసరాన్ని బట్టి ఆహారాన్ని తీసుకుంటుంది. రాత్రి 10 గంటల తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంది.