
నిజంగా నాయకుడంటే నడిపించాలి. ముందుండాలి. కష్టాలు, సుఖాల్లో తోడుండాలి. ఇప్పుడు కరోనా కల్లోలం వేళ నాయకుడు ఎలా ఉండాలో భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చూపించాడు. ప్రపంచ క్రికెట్‌లో గొప్ప క్రికెట్ కెప్టెన్ లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరు. కెప్టెన్‌గా, అతను వివిధ రకాల ఫార్మాట్ లలో చాలా విజయాలు అందుకున్నారు. జట్టును ముందు ఉండి నడిపించడంలో ముందుంటాడు. మిస్టర్ కూల్ ట్యాగ్‌ను సంపాదించాడు.
ధోని కెప్టెన్సీలో నిర్ణయాలు ఇప్పటికీ జట్లను గెలిపిస్తుంటాయి. ధోని నిర్ణయాత్మక నైపుణ్యాలు.. ఇతర ఆటగాళ్ళ పట్ల చూపించే ప్రేమ.. ఆటగాళ్లను వాడుకునే చాతుర్యం ఇప్పటికీ ప్రశంసించబడుతుంది. ఇప్పుడు ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడడంతో అందరూ ఎవరి ఇళ్లకు వారు వెళుతున్నారు. కానీ ధోని మాత్రం టీం కోసం ఆలోచించాడు. చెన్నై క్యాంపు నుంచి మొదటి విదేశీయులను యాజమాన్యంతో మాట్లాడి ప్రత్యేక విమానాలు పెట్టించి పంపించాడు. తర్వాత దేశీయ ఆటగాళ్లను పంపిస్తాన్నాడు. అందరూ వెళ్లాక ధోని చివరగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. విదేశీ .. భారత ఆటగాళ్లందరూ సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ధోని పర్యవేక్షిస్తున్నాడు.
“మహీభాయ్ హోటల్ నుండి బయలుదేరిన చివరి వ్యక్తి అని చెప్పాడు. మొదట విదేశీయులు, తరువాత భారత ఆటగాళ్లను పంపించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి సురక్షితంగా చేరుకున్నాక తాను రేపు చివరి విమానంలో వెళతానన్నాడు”అని సీఎస్కే సభ్యుడు తెలిపాడు.
తోటి ఆటగాళ్ల పట్ల ఇంతలా ఆదరణ చూపే నిజమైన నాయకుడు ఎంఎస్ ధోని. నాయకుడిగా ధోని చేసేది ఉత్తమమైనది. కరోనా సంక్షోభం మధ్య, ధోని నిర్ణయం ఇతర ఆటగాళ్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఇప్పటికే చాలా మంది భారతీయ ఆటగాళ్ళు ఇళ్లకు చేరుకున్నారు. కొంతమంది విదేశీ ఆటగాళ్ళు బ్యాచ్‌లుగా బయలుదేరుతున్నారు.
సంక్షోభం ఉన్న ఈ సమయంలో తన జట్టు కోసం చెన్నైలోనే ధోని ఉండటం ప్రేరణ కలిగిస్తోంది. కచ్చితంగా, సిఎస్‌కె అభిమానులు అతన్ని తమ కెప్టెన్‌గా చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు.