IND vs NZ: మూడు దశాబ్దాలకు మించి దాటిపోయినా.. ఇండియాలో ఒక్క విజయం దక్కలేదు .. ఇదీ న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వ్యధ

మూడు దశాబ్దాలకు మించి కాలం దాటిపోయింది. ఒక్క విజయం కూడా సొంతం చేసుకోలేదు. అలాగని ఆ జట్టు అనామకమైనది కాదు.. అరి వీర భయంకరమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అయినప్పటికీ భారత జట్టు ముందు ప్రతిసారీ చేతులెత్తేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 16, 2024 6:31 pm

IND vs NZ

Follow us on

IND vs NZ: న్యూజిలాండ్ – భారత్ మూడు టెస్టుల సిరీస్ ఆడనున్నాయి. తొలి టెస్ట్ బెంగళూరు వేదికగా బుధవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం వల్ల తొలి రోజు ఆట సాగలేదు. దీంతో టాస్ పడకుండానే మ్యాచ్ రద్దయింది. అయితే ఈ వేదికపై భారత్ – న్యూజిలాండ్ 12 సంవత్సరాల అనంతరం పోటీ పడుతున్నాయి. అంతేకాదు గత 36 సంవత్సరాలుగా భారత జట్టును సొంత గడ్డపై న్యూజిలాండ్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో పోల్చి చూస్తే భారత్ అత్యంత బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యంత దుర్బేధ్యంగా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది. దీంతో ఈ సిరీస్ పై అందరి దృష్టి నెలకొంది.. చిన్న స్వామి మైదానంలో భారత్ – న్యూజిలాండ్ జట్లు 2012లో తలపడ్డాయి. ఆ ఏడాది జరిగిన రెండవ టెస్ట్ లో భారత్ న్యూజిలాండ్ పై విజయాన్ని సొంతం చేసుకుంది. టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది. ఆ టెస్ట్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు.. ముందుగా బ్యాటింగ్ చేసి 365 రన్స్ కు ఆలౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 353 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 103 రన్స్ చేశాడు. ధోని, సురేష్ రైనా హాఫ్ సెంచరీలు చేశారు. రెండవ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ 248 రన్స్ కే చాప చుట్టింది. ఆ లక్ష్యాన్ని టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది.

1988 తర్వాత..

కొన్ని సంవత్సరాలుగా న్యూజిలాండ్ జట్టు టెస్ట్ ఫార్మాట్ లో సరిగ్గా ఆడలేక పోతోంది.. గతంలో భారత్ లో పర్యటించినప్పుడు గొప్ప ప్రదర్శన చేయలేదు. 1988 లో ముంబైలోని వాంఖడే మైదానంలో న్యూజిలాండ్ భారత గట్టుపై గెలిచింది. ఇప్పటివరకు భారత జట్టుపై ఆడిన 18 టెస్టులలో ఒక్క విజయం కూడా సొంతం చేసుకోలేదు.. 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీని న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. అదే అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోతోంది.. ఇక ఇటీవల శ్రీలంకలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయింది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ర్యాంకింగ్ లో న్యూజిలాండ్ ఆరో స్థానానికి పడిపోయింది. డబ్ల్యూటీసి 2023-25 సీజన్లో ఇప్పటివరకు న్యూజిలాండ్ 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. ఒకవేళ న్యూజిలాండ్ కనుక డబ్ల్యూటీసి ఫైనల్స్ వెళ్లాలంటే.. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేయాలి. ప్రస్తుతం ఆటగాళ్ల ఫామ్ ప్రకారం చేసుకుంటే అది సాధ్యం కాకపోవచ్చు. కాగా, భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 62 టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. భారత్ 22, న్యూజిలాండ్ 13 మ్యాచ్ లలో విజయాలు సాధించాయి. 27 మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి.