Odi World Cup 2023: 2019 వరల్డ్‌కప్ లో భారత జట్టులో గందరగోళ పరిస్థితులు. ఒక మ్యాచ్ ఆడితే.. తర్వాతి మ్యాచ్‌కు తుది జట్టులో ఉంటారో? లేదో? అనే పరిస్థితి. కానీ, ప్రస్తుత విశ్వకప్ లో టీమిండియా పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. జట్టులోని ఆటగాళ్లకు వారి పాత్రలపై పూర్తి స్పష్టత ఇవ్వడంలో మేనేజ్‌మెంట్ సఫలమైంది. ఇది పైకి మంచిగానే కనిపిస్తున్నప్పటికీ.. కొందరు ఆటగాళ్ళకు శరాఘాతం లాగా మారుతోంది. దీంతో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆ ఆటగాళ్ళు రిజర్వ్ బెంచ్ కే పరిమితం అవుతున్నారు. ఒక్క అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
మహ్మద్ షమి లాంటి టాప్ బౌలర్‌కు తుది జట్టులో చోటు దక్కక, గత మూడు మ్యాచ్‌ల్లో అతడు బెంచ్‌కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. మెగా ఈవెంట్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో షమి అద్భుతంగా రాణించాడు. ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. కానీ, జట్టులోని ఆటగాళ్లు ఆయా స్థానాల్లో కుదురుకోవడంతో మరికొన్ని మ్యాచ్‌ల్లో కూడా షమి బెంచ్‌కే పరిమితం కావాల్సి రావచ్చు. బుమ్రాతో కలసి సిరాజ్ కొత్త బంతిని పంచుకొంటున్నాడు. ఇక, హార్దిక్ పాండ్యా మూడో పేసర్ బాధ్యతలు మోస్తున్నాడు. ఫ్లాట్ వికెట్‌పై శార్దూల్‌ను నాలుగో బౌలర్‌గా ఉపయోగిస్తుండగా.. స్పిన్ ట్రాక్ ఉన్నప్పుడు అశ్విన్‌కు చోటు కల్పిస్తున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే టాప్-4పై పక్కా క్లారిటీ ఉంది. గతంలో నాలుగో నెంబర్ బ్యాటర్‌పై లెక్కలేనన్ని ప్రయోగాలు జరిగినా.. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో అతని స్థానం సుస్థిరమైంది. దీంతో సూర్యకుమార్ లాంటి హిట్టర్ కూడా అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.
సిరాజ్ స్థానంలో షమి
రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బలంగా కనిపిస్తున్నా.. ఇంకా కొన్నింటికి తగిన సమాధానాలు వెతకాల్సి ఉంది. మూడో సీమర్‌గా పాండ్యాపై టీమ్ ఎంతమేర ఆధారపడగలదు? అనేది ఎదురవుతున్న ప్రశ్న. అయితే, భారత జట్టు కూర్పు చక్కగా ఉందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. హార్దిక్ వల్లే జట్టులో సమతూకం వచ్చిందని చెప్పాడు. ‘ఆటగాళ్లను సరిగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఫలితాలు కూడా అదే విధంగా వస్తున్నాయి. చెపాక్‌లో అశ్విన్‌ను తీసుకొంటే.. ఢిల్లీ, అహ్మదాబాద్ మ్యాచ్‌ల్లో శార్దూల్‌కు చోటిచ్చారు. హార్దిక్ తన కోటాను పూర్తి చేయకపోయినా.. 5-6 ఓవర్లు వేస్తే చాలు. టీమ్‌లో ఎవరి బాధ్యతలు ఏంటి అనే విషయంలో స్పష్టత ఉంద’ని ప్రసాద్ చెప్పాడు. సిరాజ్‌ను రొటేట్ చేయాలనుకొంటే షమికి చోటు దక్కవచ్చన్నాడు. సుదీర్ఘ టోర్నీ కావడంతో రానున్న మ్యాచ్‌ల్లో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సూర్య, షమికి అవకాశం దక్కవచ్చని అన్నాడు.