Tennis History : టెన్నిస్ చరిత్ర.. అమెరికన్ల ఆధిపత్యం కాల గతిలో కలిసిపోయింది.. యూరోపియన్ల హవా మొదలైంది

టెన్నిస్ .. ఎప్పుడో 1800 కాలంలో ఇంగ్లాండ్ దేశంలో మొదలైన ఈ క్రీడ.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. టెన్నిస్ లో యూ ఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలు ప్రముఖమైనవి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 11, 2024 1:16 pm

Tennis History

Follow us on

Tennis History  : ఇంగ్లాండ్ దేశంలో పుట్టినప్పటికీ టెన్నిస్ పై మొదటినుంచి అమెరికన్లదే ఆధిపత్యం. పురుషుల విభాగంలో జాన్ మెకన్రో, విలియం లార్న్డ్, రిచర్డ్ సియర్స్, అండ్రీ అగస్సీ, జిమ్మీ కానర్స్, ఫీట్ సంప్రాస్ వంటి వారు టెన్నిస్ ను శాసించేవారు.. ఇక మహిళల విభాగంలో లూయిస్ బ్రో క్లాప్, మార్గరేట్ డ్యూ పాంట్, డోరిస్ హార్ట్, వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్, మొల్లా, మౌరిన్, బిల్లి జీన్ కింగ్, మార్టిన నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, హెలెన్ వీల్స్ మూడీ వంటి అమెరికన్ క్రీడాకారిణులు సత్తా చాటారు. టెన్నిస్ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. అమెరికా పతాకాన్ని రెపరెపలాడించారు. కాలానుగుణంగా టెన్నిస్ పై అమెరికా ఆధిపత్యం నానాటికీ తగ్గిపోతుంది. 2004లో యూఎస్ ఓపెన్ పురుషుల విభాగంలో ట్రోఫీని అమెరికన్ ఆటగాడు అండి రాడిక్ గెలుచుకున్నాడు. ఇంతవరకు మరోసారి అమెరికా ఆటగాళ్లు ఆ ట్రోఫీని దక్కించుకోలేకపోయారు. ఇటీవల యూఎస్ ఓపెన్ లో అమెరికా ఆటగా ఫ్రిట్జ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్ లో ఇటలీ ఆటగాడు సినర్ ముందు తేలిపోయాడు. దీంతో టెన్నిస్ పై యూరోపియన్ ఆటగాళ్ల ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది. ఈ సీజన్లో సినర్ వరుసగా రెండవ టైటిల్ సాధించడం విశేషం..

యూరప్ ఆటగాళ్ల హవా మొదలైంది

అగస్సీ, పిట్ సంప్రాస్, రాడిక్ హవా ముగిసిపోయిన తర్వాత అమెరికన్ ఆటగాళ్లు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇదే క్రమంలో స్విట్జర్లాండ్ కు చెందిన రోజర్ ఫెదరర్, సెర్బియాకు చెందిన జకోవిచ్, స్పైయిన్ దేశానికి చెందిన రఫెల్ నాదల్ తమ హవా కొనసాగించడం మొదలుపెట్టారు. వీరు ముగ్గురు గత రెండు దశాబ్దాలుగా టెన్నిస్ ప్రపంచాన్ని ఏలుతున్నారు. అయితే ఇందులో ఫెదరర్ టెన్నిస్ కు వీడ్కోలు పలికాడు. అయితే నాదల్ కొంతకాలంగా అంతర్జాతీయ టెన్నిస్ పోటీలలో ఆడడం లేదు. మరోవైపు సెర్బియా ఆటగాడు జకోవిచ్ మాత్రమే కుర్రాళ్ల నుంచి కోటిని ఎదుర్కొంటూ ఆడుతున్నాడు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో జకోవిచ్ ఏకంగా స్వర్ణాన్ని సాధించాడు. ఇప్పటివరకు జకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ లు సొంతం చేసుకొని.. ఆధునిక టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. గత సంవత్సరం అతడు ఏకంగా మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటలీ ఆటగాడు సిన్నర్, స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ సరికొత్త స్టార్ ఆటగాళ్లుగా అవతరించారు. ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్ స్లామ్ పోటీలలో అల్కరాజ్ , సిన్నర్ చెరో రెండు టైటిల్స్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు టెన్నిస్ పై యూరోపియన్ దేశాల ఆధిపత్యాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శించారు.

మహిళల విభాగంలోనూ..

ఇక మహిళల విభాగాన్ని పరిశీలిస్తే.. 2017లో అమెరికన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది.. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అమెరికా క్రీడాకారిణులు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోలేకపోతున్నారు. 2020లో సోఫియా కెనిన్ ఆస్ట్రేలియా క్రీడాకారిణి అశ్లీ బార్టీ తో కలిసి సంయుక్తంగా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.. అయితే ఆమె ఆ తర్వాత టోర్నీలలో ఆ స్థాయిలో ప్రదర్శన కొనసాగించలేకపోతోంది..ఇదే సమయంలో యూరప్ దేశాల నుంచి కొత్త స్టార్లు అవతరించారు. దీంతో మహిళల విభాగంలోనూ అమెరికా వెనుకంజ వేస్తోంది.

కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు

ఏంజెలెక్ కేర్బర్ (జర్మనీ), అశ్లీ బార్టీ(ఆస్ట్రేలియా), హలెప్(పోలాండ్), ముగురుజా(వెనిజులా), హలెప్(రొమేనియా), స్విటెక్(పోలాండ్), సబ లెంక( బెలారస్) దూకుడుతో అమెరికా క్రీడాకారిణులు సోయిలో లేకుండా పోతున్నారు. ప్రస్తుతం పెగులా అమెరికన్ భవిష్యత్తు ఆశా కిరణం లాగా కనిపిస్తున్నప్పటికీ.. ఇటీవల యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఆమె సబ లెంక చేతిలో ఓటమిపాలైంది. పెగులా ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ గా కొనసాగుతోంది. అయినప్పటికీ ఆమె సబలెంక చేతిలో ఓటమి పాలు కావడం విశేషం.