AP MLC Elections: ఏపీ సీఎం జగన్ వైఖరి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆయన అభిమానం, అభిరుచి, నేతలకు ఇచ్చే ప్రాధాన్యం ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఒక్కో సిట్యువేషన్ కు తగ్గట్టు ఆయన ప్రవర్తన ఉంటుంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో ఓ మంత్రికి ఆకాశానికి ఎత్తేశారు. అలా పనిచేయాలంటూ మిగతా టీమ్ కు సూచించారు. అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో అభిమానించిన మంత్రి పేరు చెబితే చాలూ మండిపడుతున్నారు. అంతెత్తుకు ఎగసిపడుతున్నారు. ప్రస్తుతం అవకాశం లేదు కదా అని కేబినెట్లో కొనసాగిస్తున్నారు. లేకుంటే ఇట్టే పక్కన పడేసేవారన్న టాక్ ఉంది. అయితే జగన్ వైఖరితో విసిగి వేశారిపోయిన సదరు మంత్రి గుణపాఠం నేర్పాలని డిసైడ్ అయ్యారు. తన ప్రాధాన్యత తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను ఓడించారన్న టాక్ వినిపిస్తోంది.
రకరకాల సమీకరణలతో..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దాదాపు 45 రోజుల ముందు తెరపైకి వచ్చిన వేపాడ చిరంజీవిరావు అనూహ్య విజయం దక్కించుకున్నారు. అయితే ఇక్కడ చాలారకాల సమీకరణలు పనిచేసినట్టు ప్రచారం సాగుతోంది. ప్రత్యర్థులు సైతం సాయం చేయడం వల్లే ఇది సాధ్యమైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీ తొలుత గాడు చినకుమారి లక్ష్మి అనే బీసీ మహిళా అభ్యర్థిని ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో పరిచయ కార్యక్రమాలతో పాటు ప్రచారం కూడా పూర్తిచేసింది. అయితే అటువంటి సమయంలోనే కాపు సామాజికవర్గానికి చెందిన వేపాడ చిరంజీవిరావును టీడీపీ ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపిక వెనుక ఓ మంత్రి హస్తం ఉందన్న ప్రచారం అయితే జరుగుతోంది.
గెలుపునకు అవకాశం ఉన్నా..
దాదాపు 34 నియోజకవర్గాలకుగాను 28 నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. పైగా సచివాలయ, వలంటీరు వ్యవస్థ అందుబాటులో ఉంది. సుమారు 6 నెలల ముందే వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది. ప్రచారం కూడా ముమ్మరంగా సాగించింది. దీంతో పార్టీ అభ్యర్థి విజయం ఖాయమన్న రేంజ్ లో ప్రచారం చేసింది. కానీ అభ్యర్థి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంత చేసినా ఎందుకీ ఓటమి అని పోస్టుమార్టం చేసే సమయంలో జగన్ కు షాకింగ్ విషయాలు తెలిశాయి. అధికార పార్టీకి చెందిన మంత్రి బొత్స సహాయ నిరాకరణ వల్లే పార్టీ అభ్యర్థి ఓటమి చవిచూసినట్టు తెలుసుకొని జగన్ ఓకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీని వెనుక జరిగిన తతంగాన్ని తెలుసుకొని బొత్స అంటేనే మండిపడుతున్నట్టు సమాచారం.
బొత్స ఎందుకు చేశారంటే?
ఉత్తరాంధ్రలో బొత్స పవర్ ఫుల్ లీడర్. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో చేరిన బొత్సకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ లేదు.పైగా తన వ్యతిరేక శక్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారన్న అనుమానం ఆయన్ను వెంటాడుతోంది. పైగా ఇష్టం లేని శాఖను కేటాయించారన్న బాధ లోలోపల ఉంది. పైగా రీజనల్ స్థాయిలో ఉత్తరాంధ్రకు రెడ్డి సామాజికవర్గం నాయకులను సమన్వయకర్తలుగా నియమించడం బొత్సకు రుచించడం లేదు. మాపై వారి పెత్తనం ఏంటి అన్న బాధ సైతం ఉండేది. ఇటువంటి సమయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. పైగా టీడీపీ అభ్యర్థి కాపు కావడంతో బొత్స వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో సైతం సహాయ నిరాకరణ చేశారన్న ప్రచారం ఉంది. అందుకే వేపాడ చిరంజీవిరావు గెలుపు సాధ్యమైందన్న టాక్ అయితే నడుస్తోంది. నిఘా వర్గాల ద్వారా సీఎం జగన్ కు ఇదే విషయం తెలియడంతో బొత్స అంటేనే జగన్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్టు అధికార పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: That minister behind tdps victory in ap mlc elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com