IPL 2023 – CSK : చెన్నై జట్టుకు తలనొప్పిగా ఆ బౌలర్.. పక్కన పెట్టకపోతే ప్రమాదమే..!

తుషార్ దేశ్ పాండే బౌలింగ్ కు వస్తే కనీసం రెండు వైడ్లు వేస్తాడు అన్న భావన ప్రతి బ్యాటర్ లోను ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ బౌలర్ వైడ్లు వేస్తున్నాడు. గతంలో ధోని దీనిపై బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు.

Written By: NARESH, Updated On : May 2, 2023 10:51 pm
Follow us on

IPL 2023 – CSK : ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రయాణం ఆశించిన స్థాయిలో సాఫీగా జరగడం లేదు. ఒడిదుడుకుల మధ్య ఈ సీజన్ కొనసాగిస్తోంది ఆ జట్టు. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది మ్యాచ్ ల్లో ఐదింటిలో మాత్రమే ధోని సేన నెగ్గింది. మరో నాలుగు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం 10 పాయింట్లు తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది చెన్నై జట్టు. మరో ఐదు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో కనీసం నాలుగింటిలో ఆ జట్టు నెగ్గాల్సి ఉంది. అప్పుడు మాత్రమే తదుపరి దశకు చెన్నై జట్టు క్వాలిఫై అవుతుంది. ప్రస్తుతం మిగిలిన జట్లు ఆడుతున్న తీరు చూస్తే ఈ జట్టుకు కాస్త ఇబ్బందికరంగానే కనిపిస్తోంది.

ఈ సీజన్ ను చెన్నై జట్టు ఆశావహ దృక్పథంతోనే ప్రారంభించింది. మొదట్లో జోరు మీద విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగింది చెన్నై జట్టు. ఆ తర్వాత మళ్లీ ఓటముల బాట పట్టి ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. వరుస విజయాలతో లీగ్ టాపర్ గా నిలిచిన చెన్నై.. ఆ తరువాత వరుసుగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్లు పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. చెన్నై జట్టుకు మిగిలిన ఐదు మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు మాత్రమే తదుపరి దశకు చేరుకుంటుంది ఈ జట్టు.

బౌలింగ్ లో తడబడుతున్న చెన్నై జట్టు..

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే బౌలింగ్ విభాగం తేలిపోతుండడంతో మ్యాచ్ ల్లో ఓటమిపాలవ్వాల్సి వస్తోంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో 201 పరుగులు చేసినా.. బలహీనమైన బౌలింగ్ కారణంగా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. చెన్నై బౌలర్లలో ప్రతి ఒక్కరూ కూడా పేలవ ప్రదర్శన చేయడం లేదు. పతిరణ, తీక్షణ, రవీంద్ర జడేజాలు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే, తుషార్ దేశ్ పాండే మాత్రం పేలవ బౌలింగ్ తో చెన్నై జట్టును ఓడిస్తూ వస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఒవర్లలో ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక దశలో పంజాబ్ కింగ్స్ 30 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో 16వ ఓవర్ వేయడానికి వచ్చిన తుషార్ దేశ్ పాండే.. ఆ ఓవర్లో మూడు సిక్సులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

వికెట్లు తీస్తున్నా.. ధారాళంగా పరుగులు..

తుషార్ దేశ్ పాండే క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ఏకపక్షంగా సాగాల్సిన మ్యాచ్ లోనూ ఈ బౌలర్ భారీగా పరుగులు ఇవ్వడంతో చెన్నై జట్టు అనుహ్యా రీతిలో ఓటమి పాలు కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. అయినా అతని బౌలింగ్ కారణంగా చెన్నై జట్టు మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవర్ కు 11 పరుగులు చొప్పున సమర్పించుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు చెన్నై జట్టుకు ఇబ్బందికరమైన అంశంగా మారుతోంది. బౌలింగ్ లో కొన్ని మార్పులు చేసుకుని పరుగులు ఇవ్వడం తగ్గిస్తే మంచి బౌలర్ గా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అదనపు పరుగులు.. అదే సమస్య..

తుషార్ దేశ్ పాండే బౌలింగ్ కు వస్తే కనీసం రెండు వైడ్లు వేస్తాడు అన్న భావన ప్రతి బ్యాటర్ లోను ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ బౌలర్ వైడ్లు వేస్తున్నాడు. గతంలో ధోని దీనిపై బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా, అతడిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. వికెట్లు తీస్తున్నాడు అన్న గుడ్డి నమ్మకంతో తుషార్ దేశ్ పాండేకు వరుసగా అవకాశాలు కల్పిస్తున్నాడు ధోని. ఆ నమ్మకమే చెన్నై జట్టును ప్రమాదంలోకి నెడుతోంది. ఈ యువ క్రికెటర్ వ్యవహారంలో పునరాలోచన చేయాలని పలువురు ధోనీకి సూచిస్తున్నారు.

నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి..

భారీగా పరుగులు సమర్పించుకుంటున్నప్పటికీ తుషార్ దేశ్ పాండేకు.. ధోని వరుసగా అవకాశాలు కల్పిస్తున్నాడు. అయితే ధోని పెట్టుకున్న నమ్మకాన్ని ఈ యువకుడు వమ్ము చేస్తున్నాడు. ఇప్పటికైనా మెరుగైన ప్రదర్శన చేసి ధోని నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకపోతే మ్యాచ్ ఆడే 11 మంది నుంచి ఈ ఆటగాడిని తప్పించాలని ధోనీకి పలువురు సూచనలు చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే చెన్నై జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకునేలా ఈ యంగ్ బౌలర్ చేసే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.