Temba Bavuma : గిబ్స్ వల్ల కానిది.. క్రాన్యే చూపించలేనిది.. పోలాక్ వల్ల సాధ్యం కానిది.. స్మిత్ చేయలేనిది.. ఇతడు చేసి చూపించాడు. బలమైన కంగారు జట్టు మీద ఐదు వికెట్ల తేడాతో గెలిచి.. సఫారి జట్టుకు టెస్ట్ గద అందించాడు. అంచనాలు లేకుండా.. అవకాశాలు పొందే అర్హత లేకుండా రంగంలోకి దిగి.. బలమైన కమిన్స్ జట్టును ఓడించి.. తన బృందాన్ని గెలిపించి.. 27 సంవత్సరాల కరువును తీర్చాడు బవుమా. వాస్తవానికి సుదీర్ఘ ఫార్మాట్ తుది పోరుకు అర్హత సాధించిన నాటి నుంచి సఫారి జట్టు మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అసలు గెలుస్తుందని నమ్మకం కూడా లేదు. చివరికి ఆ జట్టు ప్లేయర్లు కూడా ఒకానొక సందర్భంలో నిరాశకు గురయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా చేతులెత్తేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. జట్టు ఆటగాళ్లలో కెప్టెన్ స్ఫూర్తినింపాడు. పోరాడాలని కసిని పెంపొందించాడు. గంటలకు గంటలు మైదానంలో ఉండి.. ఓవర్లకు ఓవర్లు బ్యాటింగ్ చేసి జట్టును అత్యంత స్థిరమైన స్థానంలో నిలబెట్టాడు. అద్భుతమైన అర్థ శతకం చేసి.. తొడ కండరాల నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. అడుగు తీసి అడుగు వేయాలంటేనే నరకం కనిపిస్తున్నప్పటికీ.. మొత్తానికి సారధిగా తన క్రతువును మొత్తం పూర్తి చేశాడు. ఒక దశలో కంగారు జట్టు బౌలర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్న వేళ.. వారి ఆశలను వమ్ము చేశాడు సఫారి జట్టు సారధి.
ఆ పేరు వెనుక
సఫారీ జట్టు సారథి పేరు వెనుక టెంబా అని ఉంటుంది.. వాస్తవానికి ఈ పేరును చాలామంది బవు మాలో ఒక భాగం అనుకుంటారు. ఎందుకంటే దక్షిణాఫ్రికా సంస్కృతి ప్రకారం అక్కడి పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వారి సంస్కృతి ప్రకారం ఉంటాయి. బవుమా పేరు వెనుక ఉన్న టెంబా కు కూడా విస్తృతమైన నేపథ్యం ఉందని అందరూ అనుకున్నారు. కానీ దాని పేరు వెనుక ఉన్న చరిత్రను బవుమానే స్వయంగా వెల్లడించారు. “టెంబా అనేది నా పేరులో ఒక భాగం కానే కాదు. కాకపోతే ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది మా నానమ్మ పేరు. మా నానమ్మ ఎంతో ఇష్టంగా నాకు బవుమా అని నామకరణం చేసింది. నా పేరు ముందు తన పేరును జోడించింది. ఆమె పేరు టెంబా.. ఆ పదానికి దక్షిణాఫ్రికాలో సహనం, ఓర్పు, ఆత్మవిశ్వాసం అనే అర్ధాలు వస్తాయి. టెంబా అనే పేరు నా పేరు ముందుండడం వల్ల ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ.. ముందుకు సాగాలి అనిపిస్తుంది. ఎలాంటి ప్రతికూలతలోనూ దూసుకుపోవాలి అనిపిస్తుంది. ఆమె పేరు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ పేరు నా మదిలో మెదిలినప్పుడల్లా పోరాటం గుర్తుకువస్తుంది. ఏదైనా సాధించాలి అనే తపన నాలో కలుగుతుందని” బవుమా పేర్కొన్నాడు. ఇక కంగారు జట్టుతో సాగిన తుది పోరులోనూ బవుమా పోరాట స్ఫూర్తిని కనబరిచాడు. సహచరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అందువల్లే అతడు తన జట్టును విజేతగా నిలపగలిగాడు.