India Vs South Africa Final: 2003 వన్డే వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆటగాళ్లపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. చివరికి టీమిండియా – ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డాయి. సాధారణంగా ఫైనల్ ఫోబియా ఉన్న టీమ్ ఇండియాను ఆస్ట్రేలియా మైండ్ గేమ్ తో పడగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో ఓడించింది.
2023 వన్డే వరల్డ్ కప్.. లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను టీమిండియా మట్టికరిపించింది. ఫైనల్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈసారి ఆస్ట్రేలియా తన మైండ్ గేమ్ ను తెరపైకి తెచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాను 240 రన్స్ కే పరిమితం చేసింది. ఇదే క్రమంలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయం సాధించింది. మరోసారి భారత జట్టుకు భంగపాటును మిగిల్చింది. చివరికి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ ఇదే సీన్ రిపీట్ చేసింది.
ఇన్ని బాధల మధ్య టి20 వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా.. అపజయం అనేది లేకుండా దూకుడు కొనసాగించింది. సూపర్ -8 మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీఫైనల్ మ్యాచ్ లో పటిష్టమైన ఇంగ్లాండ్ ను పడుకోబెట్టింది. చివరికి ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి 176 పరుగులు చేసింది.
34 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 76 పరుగులు చేశాడు.. అక్షర్ పటేల్, శివం దూబే తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. కీలక సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు చేతులెత్తేశారు. అందువల్లే టీమిండియా ఆ స్థాయిలో పరుగులు చేయగలిగింది.
ఇక 176 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. డికాక్, క్లాసెన్, స్టబ్స్ వంటి వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా క్లాసెన్ ఆకాశమేహద్దుగా చెలరేగాడు. దీంతో విజయ సమీకరణాన్ని దక్షిణాఫ్రికా జట్టుకు అనుకూలంగా మలిచాడు. ఒకానొక దశలో 24 బంతుల్లో 26 పరుగులు చేస్తే గెలిచే స్థితికి దక్షిణాఫ్రికా జట్టును తీసుకెళ్లాడు.. అప్పటికి క్రీజ్ లో క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. దాదాపు దక్షిణాఫ్రికా జట్టు గెలుస్తుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. కామెంట్రీ బాక్స్ లో ఉన్న రవి శాస్త్రి..”ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా గెలవాలంటే కచ్చితంగా ఈ జోడిని విడదీయాలని” పేర్కొన్నాడు. ఈ దశలో రిషబ్ పంత్ అత్యవసరంగా ఫిజియోథెరపిస్టును పిలిచాడు.. తన మోకాలికి కట్టు కట్టాలని మైదానంలోకి రప్పించాడు. దీంతో ఆటకు మూడు నిమిషాల పాటు బ్రేక్ లభించింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్లు సరికొత్త ప్రణాళిక రూపొందించారు.
ఎలాగూ గెలుస్తామని ధీమాతో మిల్లర్, క్లాసెన్ తమ లయను కోల్పోయారు. క్లాసెన్ అనవసర షాట్ కు యత్నించి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ టీమ్ ఇండియా వైపు మొగ్గింది.. ఇదే సమయంలో బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టి.. 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. తమది చోకర్ టీమ్ అని మరోసారి నిరూపించుకుంది.. అందుకే ఆటలో ప్రణాళిక ముఖ్యం. అన్నిటికంటే మైండ్ గేమ్ చాలా ముఖ్యం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాలను మైండ్ గేమ్ మాత్రమే ప్రభావితం చేయగలుగుతుంది. అలాంటి మైండ్ గేమ్ ఆడింది కాబట్టే టీమ్ ఇండియా ఫైనల్ లో గెలిచింది. 17 సంవత్సరాల తర్వాత రెండవసారి t20 వరల్డ్ కప్ గెలుచుకుంది.