Team India openers KL Rahul and Rohit failed : 170 పరుగుల లక్ష్యం.. చూస్తేనే కొండంత.. టీమిండియా ఆరుగురు బ్యాట్స్ మెన్ 20 ఓవర్లలో కష్టపడి కొట్టిన ఆ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు ఇద్దరే కొట్టేశారు. వారిది ఎంత గుండెధైర్యం, వారి ఓపెనింగ్ పై ఎంత ధీమానో అర్థం చేసుకోవచ్చు. కానీ మన ఓపెనింగ్ చూస్తే.. టీ20 వరల్డ్ కప్ లోనే ఘోర వైఫల్యం.. కేఎల్ రాహుల్ మొన్నటి జింబాబ్వే మ్యాచ్ వరకూ కూడా ఫాంలో లేడు. అందులో ఓ ఆఫ్ సెంచరీ చేసి ఫాంలోకి వచ్చాడు. తీరా సెమీస్ లో తుస్సమన్నాడు.

ఇక మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ ఒక్క లీగ్ మ్యాచ్ లో 50 కొట్టి ఆ తర్వాత అస్సలు పరుగులు సాధించిన పాపాన పోలేదు. టీ20 వరల్డ్ కప్ మొత్తం చూస్తే మన టీమిండియా ఓపెనర్లే మనల్ని ముంచారని చెప్పొచ్చు. ఇక సెమీస్ లోనూ ఓపెనింగ్ జోడి కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఓవర్ లోనే కేఎల్ రాహుల్ పేలవమైన షాట్ కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక రోహిత్ కూడా పరుగులు చేయడానికి తండ్లాడి చివరకు ఔట్ అయిపోయాడు. ఇద్దరు ఓపెనర్లు అటాకింగ్ మోడ్ లో ఆడాల్సింది డిఫెన్సివ్ మోడ్ లో ఈ టోర్నీ మొత్తం ఆడారు. అదే ఓటమికి దారితీసింది. అదే ఇంగ్లండ్ ఓపెనర్లు తొలి బంతి నుంచే వీరబాదుడు మొదలుపెట్టి మన బౌలర్ల లయను దెబ్బతీసి గెలిపించారు. ఇదే మనకూ వారికి తేడా..
కేఎల్ రాహుల్-రోహిత్ జోడీ కలిసి ఈ టోర్నీలో ఇప్పటివరకూ భారత్ కు శుభారంభాన్ని అందించలేదంటే అతిశయోక్తి కాదు. ఆడిన 6 మ్యాచుల్లో ఓపెనింగ్ భాగస్వామ్యాలు చూస్తే 7, 11,23,11,27,9 పరుగులు. దీన్ని బట్టి మన ఓపెనర్లు ఎంత ఘోరంగా విఫలమయ్యారో చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో పవర్ ప్లేలో 6 ఓవర్లలో కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది. మిడిల్ ఆర్డర్ చేయబట్టే టీమిండియా విజయాలు సాధిస్తూ వచ్చింది. కోహ్లీ, పాండ్యా ఆదుకోవడంతోనే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆ మాత్రం స్కోరు అయినా సాధించింది.
కెప్టెన్ రోహిత్ నెదర్లాండ్స్ పై మినహా ఏ మ్యాచ్ లోనూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆరు మ్యాచ్ లు కలిపి అతడు చేసింది 116 పరుగులు. పాక్ పై కేవలం 4 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. నెదర్లాండ్స్ పై 53 పరుగులే టాప్. ఇక చిన్న జట్లు అయిన బంగ్లాదేశ్, జిబాంబ్వేలపై ఆఫ్ సెంచరీలతో కేఎల్ రాహుల్ రాణించినా కీలకమైన సెమీస్ లో ఘోరంగా విఫలమై టీమిండియా పుట్టి ముంచాడు. నాకౌట్ మ్యాచ్ లలో కేఎల్ రాహుల్ రాణించలేడనే అపవాదును మూటగట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా తీసేయాలన్న డిమాండ్ కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. ఈ ఓటమితో బహుశా జట్టులో భారీ మార్పులు తప్పకపోవచ్చు.