ICC Tournaments- Team India: అప్పటిదాకా కష్టపడి.. ఇక చివరికి కప్పు మనదే అనుకునే దశలో అదృష్టం ఎదురు తంతోంది.. చేతిలోని కప్పు చేజారి పోతోంది. ఇలా ఒక్కసారి అనుకుంటే ఇబ్బంది లేదు. మరోసారి అనుకుంటే గ్రహచారం బాగోలేదు అని సర్ది చెప్పుకోవచ్చు. ఒకదాని వెంట ఒకటి అన్నట్టుగా 9 ఓటములు ఎదురైతే దాన్ని ఏమనాలి? అది కూడా ఒక్క అడుగు దూరంలో ట్రోఫీలు దూరమైతే దానికి ఏం పేరు పెట్టాలి?
కలిసి రావడం లేదు
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలు టీమ్ ఇండియాకు కలిసి రావడం లేదు. కొత్త కోచ్ వచ్చినప్పటికీ ఫలితం మారడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సార్లు టీమిండియా ఐసీసీ టైటిల్స్ చేజార్చుకుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడెప్పుడో దశాబ్ద కాలం క్రితం చివరిసారిగా ఐసిసి ఛాంపియన్ ట్రోఫీని టీమ్ ఇండియా గెలుచుకుంది. 2013లో మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రో ఫీ గెలుచుకున్న టీమిండియా. తర్వాత వరుసగా పరాజయాల పాలయ్యింది. మొత్తం తొమ్మిది ఐసీసీ ట్రోఫీలు ఆడిన టీమిండియా.. నాలుగు సార్లు ఫైనల్లో.. మరో నాలుగు సార్లు సెమీఫైనల్ లో ఓడిపోయింది. 2014 t20 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా.. 2015 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో సెమి ఫైనల్లో ఓడిపోయింది. భారత్ వేదికగా జరిగిన 2016 t20 ప్రపంచ కప్ లోనూ వెస్టిండీస్ తో జరిగిన సెమీఫైనల్ లో ఓటమిపాలైంది.
పాకిస్తాన్ చేతిలోనూ
2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఇండియా చిత్తయింది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లను న్యూజిలాండ్ చేతిలో టీం ఇండియా ఓడిపోయింది. అదే ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లోనూ గ్రూప్ దశలోనే టీమిండియా ఇంటి బాట పట్టింది. 2022 t20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 209 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటకట్టుకుంది. 444 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇండియా 234 పరుగులకు ఆల్ అవుట్ అయింది. విరాట్ కోహ్లీ 49, రహానే 46, రోహిత్ శర్మ 43 పారుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్ లయన్ నాలుగు వికెట్లు తీశాడు. బోలాండ్ మూడు వికెట్లు, మిచల్ స్టార్క్ 2 వికెట్లు, ప్యాడ్ కామిన్స్ ఒక వికెట్ తీశారు.