https://oktelugu.com/

Sydney Test : కీలక బౌలర్ కు నడుం నొప్పి.. సిడ్నీ టెస్టుకు ముందు టీం ఇండియాకు షాక్!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంతిమ దశకు చేరుకుంది. ఈ సిరీస్ లో 5వ టెస్టు సిడ్ని వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా ఇప్పటికే రెండు విజయాలు సాధించి ముందంజలో ఉంది. టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించి తీవ్ర ఒత్తిడిలో ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 2, 2025 / 05:08 PM IST

    Akash Deep Ruled Out

    Follow us on

    Sydney Test : ఈ సిరీస్లో చివరి టెస్ట్ లో విజయం సాధిస్తేనే టీమ్ ఇండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి కొద్దో గొప్పో అవకాశాలుంటాయి. ఓడిపోతే మాత్రం ఇక అంతే సంగతులు. ఈ క్రమంలో టీమిండియా పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఎలాగైనా గెలవాలని ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిడ్నీ మైదానంలో తీవ్రంగా సాధన చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మొదలు పెడితే గిల్ వరకు విపరీతంగా కష్టపడుతున్నారు. బ్యాటింగ్ లో విఫలమవుతున్న ఆటగాళ్లు ప్రత్యేకంగా సాధన చేస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ల మాదిరిగా బౌలింగ్ వేసే ఆటగాళ్లతో.. బౌలింగ్ చేయించుకొని తర్ఫీదు పొందుతున్నారు.. గత కొద్ది ఇన్నింగ్స్ లలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆప్ స్టంప్ బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. అయితే అటువంటి బంతులను పదేపదే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేశారు..

    టీమిండియా కుషాక్

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వెనుకంజలో ఉన్న టీం ఇండియాకు గట్టి షాక్ తగిలింది. ఇప్పటివరకు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్ చివరి టెస్టు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అతడు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నాడు. జట్టు ఫిజియో అతడికి చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అతడు ఐదో టెస్టుకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.. అతడి స్థానంలో హర్షిత్ రాణా ను తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. హర్షిత్ మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వికెట్లను తీయలేకపోతున్నాడు. అందువల్లే అతడిని మెల్ బోర్న్ టెస్ట్ కు దూరంగా ఉంచారు. అతడి స్థానంలో ఆకాష్ దీప్ కు అవకాశం ఇచ్చారు. అయితే ఆకాష్ దీప్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ ఊహించినంత స్థాయిలో వికెట్లను తీయలేకపోయాడు. అయితే మెల్ బోర్న్ లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆకాష్ దీప్ బ్యాటింగ్ చేస్తుండగా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత అతని నొప్పి ఏమాత్రం తగ్గలేదు. పైగా అంతకంతకు పెరగడంతో.. అతడు ఐదో టెస్టు ఆడేది అనుమానమేనని జట్టు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అతడు గనుక కోలుకుంటే ఐదవ టెస్టులో ఆడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. కీలకమైన ఐదవ టెస్టులో ఆకాశ్ లాంటి బౌలర్ లేకపోవడం జట్టుకు లోటేనని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జట్టులోకి గిల్ ను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. సిరాజ్ లేదా రాహుల్ ను పక్కన పెట్టి గిల్ కు అవకాశం ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గిల్… మెల్ బోర్న్ టెస్ట్ కు దూరంగా ఉన్నాడు. మరోవైపు ఇదే టెస్టులో రాహుల్ పెద్దగా రాణించలేదు.