T20 World cup : ప్రపంచకప్ టీ20 ఆసక్తి రేపుతోంది. అటూ గ్రూప్ 1, ఇటు గ్రూప్ 2లో ఈ శని , ఆదివారాల్లో జరిగే మ్యాచ్ లతో సెమీస్ చేరే జట్లు ఏవీ అనేది తేలబోతుంది. గ్రూప్1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్ రేసులో హోరా హోరీగా తలపడబోతున్నాయి. ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో విజేత సెమీస్ చేరుతారు.ఇక ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడగొడితే ఈజీగా సెమీస్ చేరుతుంది. లేదంటే నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది.

ఇక రేపు భారత్ సెమీస్ చేరుతుందా? లేదా అన్నది తేలనుంది. అబుదాబిలో జరిగే న్యూజిలాండ్ వర్సెస్ అప్ఘనిస్తాన్ మ్యాచ్ తో భారత్ సెమీస్ అవకాశాలు బయటపడుతాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడి అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ చేరుతుంది. పొరపాటున అప్ఘనిస్తాన్ ఓడిందా? భారత్ ఇంటికి చేరడం ఖాయం. సో మన సెమీస్ చేరాలంటే అప్ఘనిస్తాన్ గెలవాలి. ఇప్పుడు ప్రతీ భారతీయుడు ఇదే కోరుకుంటున్నాడు. అప్ఘన్ గెలవాలని పూజలు చేస్తున్నారు.
దీనంతంటికి కారణం.. మన టీమిండియా వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిపోవడమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి టీమిండియా ఓడిపోయింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ గెలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాయి.
ప్రస్తుతానికి గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ ఇప్పటికే సెమీస్ చేరుకుంది. మరో స్థానం కోసం న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్, భారత్ పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచిన న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో ఇప్పుడు రెండో స్తానంలో ఉంది. రెండేసి విజయాలతో భారత్, అప్ఘనిస్తాన్ 4 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
న్యూజిలాండ్ ఒకవేళ అప్ఘనిస్తాన్ పై గెలిస్తే ఇక టీమిండియా, అప్ఘన్ ఇంటికే. దర్జాగా న్యూజిలాండ్ సెమీస్ కు చేరుతుంది. న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం నెట్ రన్ రేట్ ఆధారం అవుతుంది. న్యూజిలాండ్ కంటే అప్ఘన్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఇక ఈ రెండు జట్ల కంటే నిన్నటి గెలుపుతో భారత్ నెట్ రన్ రేట్ అందరికంటే ఎక్కువగా అయ్యింది. దీంతో కివీస్ ఓడితే టీమిండియా పంట పండినట్టే. తన చివరి మ్యాచ్లో నమీబియాను భారీ తేడాతో ఓడిస్తే టీమిండియా సెమీస్ చేరుతుంది. చూడాలి మరీ ఈ ఆదివారం ఏంజరుగుతుందో..