WI vs IRE: టీ20 ప్రపంచకప్ లో పెను సంచలనం నమోదైంది. టీ20 క్రికెట్ అంటేనే విండీస్ జట్టుగా ప్రపంచంలో పేరుంది. ఆ టీంలో ఉన్నంత మంది హార్డ్ హిట్టర్లు, ఆల్ రౌండర్లు వేరే జట్టులో ఉండేవారు కాదు.. క్రిస్ గేట్, పోలార్డ్, అండ్రూ రసెల్, సునీల్ నారాయణ్, బ్రావో లాంటి ప్రపంచ దిగ్గజ బ్యాటర్లు ఆ టీంలో ఉండేవారు. అందుకే పొట్టి ప్రపంచకప్ టీ20ని రెండు సార్లు ఆ జట్టు గెలిచింది. ప్రపంచంలోనే రెండు సార్లు ఈ కప్ అందుకున్న ఏకైక జట్టు కేవలం వెస్టిండీస్ మాత్రమే.

అంతటి భీకర జట్టు ఇప్పుడు కుదేలైపోయింది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది. టీ20 ప్రపంచకప్ లోనే పెను సంచలనం నమోదైంది. సూపర్12కు చేరకుండానే వెస్టిండీస్ జట్టు ఇంటిదారి పట్టింది.
సూపర్ 12కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది వెస్టిండీస్. హేమాహేమీ క్రికెటర్లు అంతా దూరమైన వేళ నాసిరకం ప్లేయర్లతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ను పసికూన అయిన ఐర్లాండ్ జట్టు దడదడలాడించింది. సూపర్ 12కు చేరకముందే క్వాలిఫైయర్స్ లోనే వెస్టిండీస్ ను ఓడించి ఇంటికి పంపింది.
గ్రూప్ బిలో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో ఐర్లాండ్ ఏకంగా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది.తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులే చేసింది. బ్రాండెన్ కింగ్ 62 పరుగులతో రాణించాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు ఓపెనర్లు విండీస్ ను దడదడలాడించారు. ఓపెనర్లు ఆండ్రీ , స్టిర్లింగ్ లు తొలి ఓవర్ నుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌండరీల వర్షం కురిపించారు. స్కోరుబోర్డును పరుగెత్తించారు. తొలి వికెట్ కే 73 పరుగులు జోడించారు. అనంతరం ఆండ్రీ అవుట్ అయినా కూడా స్కోరు వేగం తగ్గలేదు. టక్కర్ వచ్చి మరో ఓపెనర్ తో కలిసి దంచి కొట్టడంతో 17.3 ఓవర్లలోనే విండీస్ విధించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ ఛేదించింది.
వెస్టిండీస్ లాంటి భీకరజట్టు ఇప్పుడు ఇలా అయిపోవడం.. పసికూన ఐర్లాండ్ అంత చిత్తుగా ఓడించడం చూసి ఆ జట్టును చూసి అయ్యో పాపం అని అందరూ అంటున్నారు. రెండు సార్లు కప్ కొట్టిన జట్టు ఇదేనా? అని డౌట్ పడుతున్నారు. వెస్టిండీస్ దీన స్థితిపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మంచి క్రికెటర్లను పక్కనపెట్టడమే ఈ దుస్థితికి కారణం అని ఆరోపిస్తున్నారు. మెరుగైన జట్టును పంపలేదని తిట్టిపోస్తున్నారు.