T20 World Cup Dhoni: రెండేళ్ల క్రితం.. వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఘోర ఓటమి తర్వాత ఎంఎస్ ధోని మళ్లీ క్రికెట్ ఆడలేదు. ఆ జట్టులో సభ్యుడిగా అదే చివరి ఆట.. ఆ తర్వాత టీమిండియాకు గుడ్ బై చెప్పి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపి సత్తా చాటాడు. తన కెప్టెన్సీ బుర్రకు పదును ఇంకా తగ్గలేదని నిరూపించాడు.
ఇక ప్రపంచకప్ టీ20లో టీమిండియా మెంటర్ గా ధోని జాయిన్ కావడంపై కెప్టెన్ కోహ్లీ అయితే ఫుల్ ఖుషీ ఉన్నాడు. అతడు తోడుంటే.. అతడి ఐడియాలో ఈజీగా ప్రపంచకప్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ధోని రాక డ్రెస్సింగ్ రూమ్ లోని ఆటగాళ్ల మనోబలాన్ని రెట్టింపు చేస్తుందని చెప్పాడు. ధోని నాయకత్వ పాత్రలో ఉన్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంటుందని.. ఈ వాతావరణంలో ఆడటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. టీ20 వరల్డ్ కప్ కోసం ఎంఎస్ ధోనిని మెంటర్ గా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఇది మాకు ధైర్యాన్ని ఇస్తుందని కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.
ఐపీఎల్ ముగిసి చెన్నై విజేతగా నిలవడంతో ఇప్పటివరకు ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న ధోని ఇప్పుడు కొత్త అవతారంలోకి వచ్చేశారు. టీమిండియా మెంటర్ గా జాయిన్ అయ్యాడు. భారత జట్టు మొదటిసారి మైదానంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే టీమిండియాలోకి మాజీ కెప్టెన్, ధోని ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు అతడికి ఘన స్వాగతం పలికారు.. రెండేళ్ల తర్వాత ధోని టీమిండియా ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. మైదానంలో టీమిండియా దుస్తుల్లో కనిపించాడు. అతడి సలహాలను ఆటగాళ్లంతా శ్రద్ధగా విన్నారు.
ప్రస్తుతం టీమిండియా దుబాయ్ లో ఉంది. అక్టోబర్ 18న సోమవారం జరిగే తొలి వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్ కు ఒకరోజు ముందు ఆదివారం రాత్రి టీమిండియా ఐసీసీ క్రికెట్ అకాడమీ మైదానంలో కసరత్తు ప్రారంభించగా.. ధోని ఎంట్రీ ఇచ్చాడు. అతడికి జట్టు సాదర స్వాగతం పలికింది. టీమీండియా, ధోని ఫొటోలను పోస్ట్ చేసిన బీసీసీఐ ‘ఏ వెరీ వార్మ్ వెల్ కం కింగ్’ అంటూ పోస్టు చేసింది.
ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బందితో బ్యాటింగ్ గురించి ధోని మాట్లాడారు. ధోనికి స్వాగతం పలుకుతూ బీసీసీఐ తన పోస్ట్ లో కొనియాడింది. టీమిండియా ధోని కెప్టెన్సీ వదలుకున్నా ఒక్క టైటిల్ గెలవలేదు. అతడి వారసుడు కోహ్లీ ఆటగాడిగా బాగా రాణిస్తున్నా కెప్టెన్ గా విఫలమయ్యాడు. కెప్టెన్ కోహ్లీ, రవిశాస్త్రీ పదవీకాలంలో మూడు ప్రపంచకప్ లలో టీమిండియా ఓడిపోయింది. ఈ క్రమంలోనే బీసీసీఐ అభ్యర్థన మేరకు ధోని టీమిండియాతో చేరాడు. ఈ ప్రపంచకప్ ముగిసే వరకూ టీంతోనే ఉంటాడు.
అక్టోబర్ 24న టీమిండియా తన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఢీకొట్టుంది.ఆ తర్వాత న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్ తోనూ తలపడుతుంది. ఈ గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుతాయి.