Virat Kohli Vs Naveen ul Haq: టీమిండియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్‌లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీని ఆఫ్ఘన్ క్రికెటర్, ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయిట్స్ తరఫున ఆడుతున్న నవీన్ ఉల్ హక్ ఎగతాళి చేశాడు. ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌ను టీవీలో చూసిన నవీన్.. కోహ్లీ ఔట్ అయిన తర్వాత తియ్యటి మామిడి పండ్లతో కూడాన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.
ఇటీవలే గొడవ..
తొలి అర్ధభాగం వరకు అంతా సాఫీగా సాగుతూ వచ్చిన ఐపీఎల్‌ను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేశారు. భారీ స్కోర్లు నమోదు కావడం, చివరి బంతి వరకు విజయం ఊరించడంతో ప్రతీ మ్యాచ్ రంజుగా సాగింది. అయితే ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ కోహ్లికి.. లక్నో జూపర్ జెయిట్స్ ఆటగాడు నవీనుల్ హక్, ఆజట్టు మెంటర్ గౌతం గంభీర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లో కోహ్లి తన షూను చూపిస్తూ తిట్టడం నవీన్ ఉల్‌హక్‌కు ఆగ్రహం తెప్పించింది. మ్యాచ్ అనంతరం కోహ్లితో అతను గొడవ పడ్డాడు. ఇందులోకి గంభీర్ కూడా ఎంటర్ అయ్యాడు. ఈ విషయంలో కోహ్లీ, నవీన్‌కు బీసీసీఐ ఫూర్తి ఫీజు కోత విధించింది.
స్టేటస్ వార్..
అయితే అంతటితో వివాదం సద్దుమణగలేదు. మరుసటి రోజు కోహ్లి, నవీన్ ఉల్‌హక్ మధ్య స్టేటస్‌ల రూపంలో గొడవ కొనసాగింది. ఒకరి మీద ఒకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకున్నారు. అయినా నవీన్ మాత్రం ఇంకా ఈ విషయాన్ని వదిలిపెట్టట్లేదు.
సోషల్ మీడియాలో మరో పోస్టు..
మంగళవారం ముంబయితో మ్యాచ్‌లో కోహ్లి ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌ను తాను టీవీలో చూస్తూ దృశ్యాన్ని నవీన్ ఉల్ హక్క సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘తియ్యనైన మామిడి పండ్లు’ అని కామెంట్ పెట్టాడు. టీవీలో విరాట్ కనిపించకపోయినా.. అప్పటికే అతను ఔటైన నేపథ్యంలో నవీనుల్ తన ఆనందాన్ని పంచుకున్నట్లయింది.
కోహ్లీ అభిమానుల ఆగ్రహం..
నవీన్ పోస్టుపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా స్ఫూర్తి కొరవడడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సద్దుమణిగిన వివాదాన్ని నవీన్ కావాలనే మళ్లీ రేపుతున్నాడని విమర్శిస్తున్నారు. ఆటలో చిన్నచిన్న గొడవలు సాధారణమే అయినా నవీన్ దానిని పెద్దది చేయాలని చూస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొంటున్నారు. దీనిపై బీసీసీఐ స్పందించాలని కోరుతున్నారు.