SRH Vs MI: నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు సత్తా చూపింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో టేబుల్ టాపర్ రాజస్థాన్ జట్టుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది . ఈ సీజన్లో ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్.. ఆరు గెలిచి 12 పాయింట్లు సాధించింది.
రాజస్థాన్ జట్టుపై సాధించినట్టుగానే.. జట్టుపై విజయాన్ని దక్కించుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. ఈ సీజన్లో ముంబై జట్టుతో ఆడిన ఒక మ్యాచ్లో హైదరాబాద్ 277 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. సోమవారం ఆడబోయే మ్యాచ్ లోనూ ముంబై జట్టుపై విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ ఆశలను మరింత సుస్థిరం చేసుకోవాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. వరుస ఓటములతో ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి బయటికి వచ్చేసింది. ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆడే చివరి మ్యాచ్లలో విజయాలు అందుకుని టోర్నీ నుంచి సగర్వంగా నిష్క్రమించాలని భావిస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్న ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. పైగా సొంత మైదానంలో ఆడుతోంది కాబట్టి.. ముంబై జట్టుకు అది అడ్వాంటేజ్ కావచ్చు.
ఈ క్రమంలో ప్రత్యేక ప్రణాళికలతో ముంబై జట్టును ఓడించాలని హైదరాబాద్ భావిస్తోంది. వాంఖడే వేదికగా కోల్ కతా, ముంబై జట్లు తలపడిన మ్యాచ్ లో ఆశించినత స్కోరు నమోదు కాలేదు. వికెట్లు కూడా వెంట వెంటనే పడిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు అనుభవజ్ఞుడైన ఆటగాడిని తీసుకోవాలని భావిస్తోంది. రెండు మ్యాచ్ లలో అవకాశం ఇస్తే.. ఏమాత్రం సత్తా చాటని అన్మోల్ ప్రీత్ సింగ్ కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ కు అవకాశం ఇవ్వనుంది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై, హైదరాబాద్ 22 సార్లు ఢీకొన్నాయి. 12 మ్యాచ్లలో ముంబై, పది మ్యాచ్లలో హైదరాబాద్ విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ముంబై జట్టుపై 31 రన్స్ తేడాతో విజయాన్ని అందుకుంది.
హైదరాబాద్ జట్టు అంచనా ఇలా
హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్/ అన్మోల్ ప్రీత్ సింగ్, క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్, జాన్సన్, కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్.