Homeక్రీడలుRR Vs SRH 2023: ఓటమికి కూడా జాలేసింది.. సన్ రైజర్స్ ను గెలిపించింది.. ఐపీఎల్...

RR Vs SRH 2023: ఓటమికి కూడా జాలేసింది.. సన్ రైజర్స్ ను గెలిపించింది.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదో అద్భుతం

RR Vs SRH 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళుతోంది. ఆదివారం జరిగిన హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబడేలా చేసింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో విజయం అనేక మలుపులు తిరుగుతూ చివరికి హైదరాబాదును వరించింది. వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్న హైదరాబాద్ జట్టుపై ఓటమికి కూడా జాలేసి పక్కకు తప్పకుని విజయాన్ని అందించినట్టుగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ చూస్తే అనిపిస్తుంది.

చివరి బంతికి ఐదు పరుగులు కావాలి.. సిక్స్ కొడితే విజయం.. ఫోర్ కొడితే టై. సందీప్ శర్మ బంతి వేశాడు సమద్ గట్టిగా కొట్టాడు. లాంగ్ ఆఫ్ లో బట్లర్ చేతికి చిక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు. ఆనందంలో రాజస్థాన్ జట్టు మునిగింది. కానీ, అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా కొద్ది క్షణాల తర్వాత నో బాల్ సైరన్ వినిపించగానే షాక్ లో రాజస్థాన్.. హమ్మయ్య అనుకుంటూ సన్ రైజర్స్ లో ఆశలు చిగురించాయి. ఈసారి సందీప్ బంతి వేశాడు. సమద్ దాన్ని సిక్సుగా మలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

భారీ లక్ష్యాన్ని విధించిన రాజస్థాన్ జట్టు..

ఆదివారం సాయంత్రం జరిగిన రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు ఏకంగా 215 పరుగుల లక్ష్యాన్ని విధించింది. రాజస్థాన్ బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో భారీ స్కోర్ నమోదయింది. బట్లర్ 59 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సులతో 95 పరుగులు చేశాడు. సంజూ సాంసన్ 38 బంతుల్లో నాలుగు ఫ్లోర్లు, ఐదు సిక్సులతో 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ చెలరేగడంతో రాజస్థాన్ జట్టు 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అంత బలమైన బ్యాటింగ్ లైనప్ లేని జట్టుగా పేరున్న హైదరాబాద్.. ఈ భారీ లక్ష్యాన్ని జోరుగానే ఛేదించే ప్రయత్నం చేసింది. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 55 పరుగులు, రాహుల్ త్రిపాఠి 29 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సులతో 47 పరుగులు, క్లాసెన్ 12 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సులతో 26 పరుగులు చేయగా, గ్లెన్ ఫిలిప్ ఏడు బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సులతో 25 పరుగులు, అబ్దుల్ సమద్ ఏడు బంతుల్లో రెండు సిక్సులతో 17 పరుగులు చేసి నాటౌట్ గా జట్టుకు అద్భుత విజయాన్ని అందించి పెట్టాడు. దీంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.

ఆశలు లేని స్థితి నుంచి.. అద్భుత విజయం దిశగా..

మామూలు లక్ష్యాలను ఛేదించలేక చతికిల పడుతున్న హైదరాబాద్ జట్టు.. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అనుకున్నారు అభిమానులు. అయితే, అభిమానులు అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ జట్టు విజయానికి చేరువగా వెళ్లి దూరం అయినట్టు కనిపించింది. అయితే, అనూహ్యంగా జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. భారీ లక్ష్యమే అయినా హైదరాబాద్ జట్టు 9 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసి.. విజయానికి దూరంగా నిలిచింది రైజర్స్ జట్టు. ఓపెనర్లు అన్మోల్ ప్రీత్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 33 పరుగులు చేశాడు. అభిషేక్ బ్యాట్ ఝులిపించాడంతో భారీగా పరుగులు వచ్చాయి. కానీ, లక్ష్యం చాలా పెద్దది. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ దాదాపు 13 కు చేరింది. చేతిలో 9 వికెట్లు ఉన్నా.. రైజర్స్ కు విజయం అంత తేలిక కాదనిపించింది. కానీ, అభిషేక్ తోపాటు రాహుల్ త్రిపాఠి చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కొన్ని చక్కని షాట్లు తరువాత అభిషేక్ నిస్క్రమించిన.. 14 ఓవర్లలో 136/2 తో విజయానికి దగ్గరగా వెళ్లినట్టు కనిపించింది. కానీ, వెంట వెంటనే క్లాసెన్, త్రిపాఠి, మార్క్రమ్ వికెట్లు కోల్పోవడంతో విజయం కష్టమే అనిపించింది. చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు అవసరం కావడంతో విజయం సాధ్యం కాదనిపించింది. కానీ, 19 ఒవర్ లో గ్లెన్ ఫిలిప్ వరుసగా 6, 6, 6, 4 బాదడంతో.. చివరి ఓవర్ లో విజయానికి 17 పరుగులు అవసరం అయ్యాయి. ఆఖరి ఓవర్ సందీప్ శర్మ బౌలింగ్ చేయగా.. మొదటి 5 బంతుల్లో 12 పరుగులు రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి బంతికి సమద్ క్యాచ్ ఔట్ కావడంతో రాజస్థాన్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. కానీ, ఆ జట్టుకు షాకిస్తూ అది నో బాల్ గా అంపైర్ నిర్ధారించారు. ఈ అవకాశాన్ని సమద్ సద్వినియోగం చేసుకున్నాడు. బౌలర్ తల మీదుగా సిక్స్ కొట్టిన సమద్.. రైజర్స్ జట్టును విజయపథంలో నడిపించాడు. అంతకుముందు రాజస్థాన్ ఇన్నింగ్స్ అంతా బాదుడే అన్నట్టుగా సాగింది. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది రాయల్స్. యశస్వి జైస్వాల్ 18 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇస్తే.. ఆ తర్వాత వచ్చిన సంజు సాంసన్, బట్లర్ విధ్వంసాన్ని సృష్టించారు. మొదటి 5 ఓవర్లలో రాజస్థాన్ 54 పరుగులు చేస్తే, అందులో జైశ్వాల్ చేసినవే 35 పరుగులు కావడం గమనార్హం. అయిదో ఓవర్ ఆఖరి బంతికి అతడు అవుట్ కాగా, తర్వాత నుంచి సాంసన్ దంచుడు మొదలుపెట్టాడు. బట్లర్ కూడా విజృంభించడంతో భారీ స్కోర్ నమోదు అయింది. వీరిద్దరి మధ్య 81 బంతుల్లోనే 138 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బారీ స్కోర్ చేసినప్పటికీ రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించలేక చతికల పడింది.

RELATED ARTICLES

Most Popular