Sunrisers Hyderabad: ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. కోల్కతా నైట్ రైడర్స్ తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చివరి ఓవర్ లో 9 పరుగులు చేయలేక చేతులెత్తేసింది హైదరాబాదు జట్టు.
ఈ సీజన్ లో అత్యంత ఘోరమైన ఆట తీరును కనబరుస్తోంది హైదరాబాద్ జట్టు. పేపర్ పై చూస్తే బలంగా కనిపిస్తున్న ఈ జట్టు.. మైదానంలోకి దిగిన తరువాత అనామక జట్లపై కూడా గెలవలేక చతికిల పడుతోంది. మొదట్లో జట్టు గాడిన పడినట్టు కనిపించినా.. మళ్లీ అదే ఆట తీరుతో అభిమానులను తీవ్ర నిరాశ పరుస్తోంది. గత సీజన్ల కంటే దారుణంగా ఈ ఏడాది ప్రదర్శన ఉండడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.
పేలవ బ్యాటింగ్ తో ఓటమిపాలు..
సునాయాసంగా గెలవాల్సిన మ్యాచులను హైదరాబాద్ జట్టు పేలవ బ్యాటింగ్ తో చేజార్చుకుంటోంది. ఎప్పటిలాగానే లోయర్ ఆర్డర్ మరోసారి ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా మూడు తప్పిదాలు హైదరాబాద్ పతనాన్ని శాసించాయి. టాపార్డర్ ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ ఆదుకోవాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్ ఇబ్బంది పడిన టాప్ ఆర్డర్ అద్భుతంగా రానిస్తే విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. కానీ హైదరాబాద్ జట్టులో ఆ సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
స్టార్ ఆటగాళ్ల వైఫల్యంతో ఇబ్బందులు..
హైదరాబాద్ జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవేలేదు. వీరి ఫెయిల్యూర్ ఇప్పుడు జట్టుకు ఇబ్బందికరంగా మారుతోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, మాయాంక్ అగర్వాల్ తోపాటు రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్ దారుణంగా విఫలం కావడంతో హైదరాబాద్ జట్టు అవకాశాలను దెబ్బతీసింది. గత మ్యాచ్ లో అర్థ సెంచరీ తో రాణించిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో 9 పరుగులకే వెనుదిరిగాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ తమ వైఫల్యాన్ని కొనసాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా హ్యారీ బ్రూక్ డకౌట్ గా వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడి కాస్త పరవాలేదనిపించినా.. ఎక్కువసేపు క్రేజులో నిలబడలేకపోయాడు. ఈ నలుగురులో ఒక్కరు మెరుగైన ఇన్నింగ్స్ ఆడినా పరిస్థితి మరోలా ఉండేది.
ఆ భాగస్వామ్యం బ్రేక్ కావడంతో ఇబ్బందుల్లోకి..
54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ ఆదుకున్నారు. మార్క్రమ్ నిదానంగా ఆడినా క్లాసెన్ భారీ సిక్సర్లు భాదాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఐదో వికెట్ కు 70 పరుగులు జోడించిన అనంతరం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లాసెన్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగినట్టు అయింది. ఆచితూచి ఆడిన మార్క్రమ్ కూడా వెంటనే వెనుదిరగడంతో హైదరాబాద్ జట్టు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ ఇద్దరిలో ఒక్కరైనా చివరి వరకు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇద్దరూ కొద్ది నిమిషాల వ్యవధిలోనే అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు.
చివరి దశలో వికెట్లు కోల్పోవడంతో..
క్లాసెన్, మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత హైదరాబాద్ జట్టు విజయానికి చివరి 19 బంతుల్లో 27 పరుగులు కావాలి. ఆచితూచి ఆడినా సన్ రైజర్స్ విజయం సాధించేది. కానీ ఒత్తిడికి లోనైన హైదరాబాద్ జట్టు వికెట్లు కోల్పోయి ఓటమికి తలవంచింది. 18 వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి ఐదు పరుగులే ఇవ్వడంతో ఒత్తిడికి గురైన.. మార్కో జాన్షెన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత భువనేశ్వర కుమార్, సమద్ బౌండరీలు బాదినా.. ఆఖరి ఓవర్ లో అబ్దుల్ సమద్ భారీ షాట్ కు ప్రయత్నించి వెనుదిరగడంతో మ్యాచ్ కోల్కతా జట్టు వశమైంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ నితీష్ రానా.. వరుణ్ చక్రవర్తిని డెత్ బౌలర్ గా వాడుకోవడం ఆ జట్టుకు కలిసి వచ్చింది. ఈ ఒక్క మ్యాచ్ లోనే కాకుండా అనేక మ్యాచ్ ల్లో హైదరాబాద్ జట్టు ఇదే విధమైన తప్పులు చేస్తుండడంతో ఓటమి పాలు కావాల్సి వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక మ్యాచ్ లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని మిగిలిన మ్యాచ్ లకు సిద్ధమైతే ఉపయోగం ఉండేదని, ఆ తప్పులను హైదరాబాద్ జట్టు సరిదిద్దుకోకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు నుంచి ఇంతకుమించి ఆశించలేమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Web Title: Sunrisers hyderabad team is failing miserably in ipl 2023 season
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com