Sundar Pichai Cricket Commentary: ఒకప్పుడు క్రికెట్ సంపన్న వర్గాలకే పరిమితమయ్యేది. సంపన్న వర్గాలు మాత్రమే క్రికెట్ చూసేవారు. కామెంట్రీ కూడా ఒక సెక్షన్ వాళ్లు మాత్రమే చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రికెట్ అనేది అన్ని వర్గాలకు దగ్గరయింది. వినూత్నమైన విధానాలతో ఐసీసీ క్రికెట్ ను విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. తద్వారా ఫుట్ బాల్ ను బీట్ చేసే స్థాయికి క్రికెట్ ఎదిగింది. ఐపీఎల్ లాంటి టోర్నీలు క్రికెట్ కు సరికొత్త అర్ధాన్ని ఇస్తున్నాయి.. వినూత్నమైన వ్యాపార కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ ఇప్పటికే రెండు విజయాలు సాధించింది. భారత్ ఒక విజయం అందుకుంది. ఐదవ టెస్ట్ ప్రస్తుతం లండన్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. రెండు జట్లు పోటాపోటీగా ఆడుతున్న నేపథ్యంలో.. విజేత ఎవరనేది చెప్పడం కష్టంగా మారింది. తొలి టెస్ట్ లో 200+ పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమిండియా.. రెండవ ఇన్నింగ్స్ లో దూకుడు కొనసాగించింది 390+ పరుగులు చేసి అదరగొట్టింది. టీమిండియాలో జైస్వాల్ సెంచరీ, ఆకాష్ , రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్ లతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.. ఎదురుదాడికి దిగి పరుగుల వరద పారించాడు.
వాషింగ్టన్ సుందర్ క్రితం మ్యాచ్ లో సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా తో కలిసి అజేయమైన భాగస్వామ్యం నెలకొల్పి.. టీమిండియాను ఓటమి నుంచి తప్పించాడు. ఐదో టెస్టులోనూ సుందర్ అదే జోరు కొనసాగించాడు.. తద్వారా తన అద్భుతమైన బ్యాటర్ నని నిరూపించుకున్నాడు. సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కామెంట్రీ బాక్స్ లోకొన్గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వచ్చారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న తీరును ఆస్వాదించారు. అద్భుతంగా ఆడుతున్నాడు అంటూ కితాబిచ్చారు. హర్షా బొగ్లే తో కలిసి కామెంట్రీ చేసిన సుందర్.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు..” నేను టీనేజ్ లో ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ కు పెద్ద ఫ్యాన్ ని. నా రూమ్ లో ఆయన ఫోటోలు ఉండేవి. ఆ తర్వాత సచిన్ కూడా నా అభిమాన ఆటగాడు అయ్యాడు. క్రికెట్ ను చూస్తుంటాను. చూస్తూ ఆస్వాదిస్తాను. ఖాళీ దొరికితే ఒత్తిడిని తగ్గించడానికి క్రికెట్ ఒక మంత్రం లాగా పనిచేస్తుంది.. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతని ఆట చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడు ఆడిన విధానం టీమ్ ఇండియాకు మరింత బలాన్ని అందిస్తోందని” సుందర్ హర్షా బోగ్లే అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు.
సుందర్ గత ఐపిఎల్ లో కూడా సందడి చేశాడు. చెన్నైలో పుట్టిన సుందర్.. మనదేశంలో అత్యున్నత విద్యను అభ్యసించి.. అమెరికా వెళ్ళిపోయారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఏకంగా గూగుల్ సీఈఓ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన గూగుల్ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు వీలు దొరికినప్పుడల్లా ఇలా క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఆస్వాదిస్తున్నారు. తాజాగా క్రికెట్ కామెంట్రీ చేసి సుందర్ అదరగొట్టారు.. సుందర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.