IND Vs PAK: క్రికెట్ లో ఎన్ని జట్లు ఉన్నా.. ఏ విధంగా తలపడినా.. రక్తి కట్టించే ఆట ఆడినా.. పాకిస్తాన్, భారత్ పోరు అంటే మాత్రం ఎక్కడా లేని ఆసక్తి మొదలవుతుంది. అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు చర్చ నడుస్తోంది. టిఆర్పి రేటింగ్స్ లో సరికొత్త రికార్డు నమోదవుతుంది. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండడంతో.. రెండు జట్లు తలపడే క్రికెట్ మ్యాచ్ అంటే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. ఇక ఇప్పటివరకు రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లలో భారత జట్టుదే పై చేయి గా ఉంది. అయితే త్వరలో ఈ రెండు జట్లు టి20 వరల్డ్ కప్ లో తలపడనున్నాయి. జూన్ 9న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ కు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రోమో విడుదల చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ప్రోమో ఎలా ఉందంటే..
పాకిస్తాన్, భారత జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై ఆసక్తిని మరింత పెంచేందుకు స్టార్ స్పోర్ట్స్ ఈ ప్రోమో రూపొందించింది.. భారత జట్టు అభిమాని రతన్, పాకిస్తాన్ జట్టు అభిమాని అల్తాఫ్ మధ్య జరిగిన సంభాషణతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. 2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాగా.. ఆ సిరీస్ లో భారత్ పాకిస్తాన్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ లలో గెలిచింది. ఫైనల్ మ్యాచ్ లో అయితే సూపర్ ఓవర్ ద్వారా కప్ దక్కించుకుంది. ధోని ఆధ్వర్యంలో టీమిండియా కప్ గెలిచినప్పుడు రతన్ ధోని పేరుతో ఉన్న ఒక జెర్సీని అల్తాఫ్ కు పంపిస్తాడు. దాన్ని చూస్తూ అల్తాఫ్ ఏడుస్తాడు. ఆ తర్వాత 2012లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియా పాకిస్తాన్ జట్టుపై గెలుస్తుంది. ఆ ఓటమిని జీర్ణించుకోలేక అల్తాఫ్ ఒక సుత్తితో టీవీ ని పగలగొడతాడు. అదే సమయంలో తన కాలికి గాయం చేసుకుంటాడు. 2014లోనూ సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది. ఆ సమయంలో రతన్ అల్తాఫ్ కు ఉప్పు ప్యాకెట్ పంపిస్తాడు. గాయమైన చోట రాసుకోమని సలహా ఇస్తాడు. దానికి అల్తాఫ్ కు మండిపోతుంది. 2021 లో టి20 వరల్డ్ కప్ లో మాత్రం పాకిస్తాన్ టీం ఇండియా పై గెలుస్తుంది. “నువ్వూ ఖాతా తెరిచావు” అంటూ అల్తాఫ్ కు రతన్ ఒక గిఫ్ట్ పంపిస్తాడు.
ఇక 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై టీమిండియా గెలుస్తుంది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపిస్తాడు. దాన్ని పురస్కరించుకొని రతన్ అల్తాఫ్ కు చోలే బటూరే పంపిస్తాడు. ఎందుకంటే అది విరాట్ కోహ్లీకి అత్యంత ఇష్టమైన వంటకం కాబట్టి.. దాన్ని తినుకుంటూ.. విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ లు చూడమని సలహా ఇస్తాడు. దానికి అల్తాఫ్ కు మండిపోతుంది. అయితే ఇద్దరి మధ్య జరుగుతున్న పోరుకు శుభం కార్డు వెయ్యాలని రతన్ నిర్ణయించుకుంటాడు. ఇదే సమయంలో ఆల్తాఫ్ కు నన్ను క్షమించమని ఒక లేఖ రాస్తాడు. “నాకు దగ్గు వస్తోంది.. అంత సమయం కూడా లేదు త్వరగా వచ్చేయ్ అని అంతేకాదు పాస్ పోర్ట్ పట్టుకుని రమ్మని” ఆ లేఖలో పేర్కొంటాడు . దీంతో అల్తాఫ్ ముస్తాబై రతన్ చెప్పిన చోటికి వెళ్తాడు. క్షమాపణ చెప్పమని అడుగుతాడు. దానికి రతన్ కొద్దిసేపు దగ్గుతున్నట్టు నటించి, తన ఒంటిమీద ఉన్న శాలువా తీసేస్తాడు. దీంతో అతడు ధరించిన టీమిండియా టి20 వరల్డ్ కప్ జెర్సీ కనిపిస్తుంది. ఫలితంగా ఆల్తాఫ్ ఒక్కసారిగా హతాశుడవుతాడు. అనంతరం రతన్ మాట్లాడుతూ.. “నేను క్షమాపణ చెప్పడానికి నేను పిలవలేదు. జూన్ 9న పోరుకు రమ్మని నిన్ను పిలిచానని” గట్టిగా అరుస్తాడు. దీంతో అల్తాఫ్ షాక్ కు గురవుతాడు. ఇక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. దీనికి గ్రేట్ రైవలరీ (great rivalry) అని స్టార్ స్పోర్ట్స్ పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది.. ఈ ప్రోమో చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. క్రికెట్ మ్యాచ్ మీద హైప్ పెంచేందుకు స్టార్ స్పోర్ట్స్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.
THE GREATEST RIVALRY
Another loss is loading in the #GreatestRivalry, and will be gift-wrapped and delivered by Rohit’s men, when #TeamIndia takes on Team Pakistan in less than a month, at #T20WorldCup2024!
India fans have got another ‘mauka’ to deliver a special ‘Tohfa’… pic.twitter.com/9vvzMeNPSp
— Star Sports (@StarSportsIndia) May 17, 2024